పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌశికునికథ.

353

లిరువురు మిక్కిలి చక్కనివారు తరుణవయస్కు లతనివాడుక విని బ్రాహ్మణపుత్రవేషధారులై యరుదెంచి యతని నాశ్రయించిరి.

ప్రియదర్శనులైన నాగకుమారుల నాదరించుచు రాజకుమారుండు తనకు విస్రంభపాత్రులగు మిత్రులలోఁ జేర్చికొని క్రీడించుచుండెను. ప్రతిదినము నాగకుమారులు రాత్రులఁ బాతాళలోకమున కేగుచుఁ బ్రొద్దుపొడువఁగ నే వచ్చి యతని నాశ్రయించి యుత్సవములలోఁ బాల్గొనుచుందురు. వారికి రాజపుత్రునందు ప్రీతి దినదినాభివృద్ధి వడయుచున్నది.

రాజపుత్రుఁడు నాగకుమారులు లేక భుజంపఁడు. స్నానము సేయఁడు. మంచిపుట్టంబులఁ గట్టడు. మాల్యాను లేపనాదుల ధరింపడు. అట్లు వా రన్యోన్య ప్రేమానుబంధపూర్వకమగు సౌహార్దముతో మెలఁగుచుండిరి.

ఒకనాఁ డశ్వతరుండు మర్త్యలోకమునుండి వచ్చిన కుమారులం గాంచి పుత్రులారా ! నిత్యము మీ రెక్కడికి పోవుచుంటిరి ? రాత్రులు దప్ప పగలు మీరిందుఁ గనంబడ రేమి ? అని యడిగినఁ దండ్రికి నమస్కరించుచు నాగకుమారు లిట్లనిరి. జనకా ! పుడమి ఋతుధ్వజుండను రాజపుత్రుండు మాకు మిత్రుండయ్యె. నతనిసుగుణంబులు శేషుండు వర్ణింపఁజాలఁడు. అతండు మామనసు లాకర్షించెను. వినయసంపన్నుండు. తద్వియోగంబు సైరింపఁజాలమని యతనివృత్తాంతము చెప్పిరి.

ఆకథ విని యశ్వతరుం డాహా ! అట్టిసుగుణసంపన్నునిఁ గుమారునిగాఁ బడసినతండ్రి యదృష్టమేమి ? పరోక్షమున నెవ్వరిగుణంబులు స్తుతియింతురో యతండే ధన్యుఁడు. అట్టిసుగుణఖని కేదేని యుపకారము సేయుతలంపు గలిగినది. మీనిమిత్తమై తదభీష్టము తీర్తు. మఱియు, మనయింటనున్న ధనకనకవస్తువాహనాదులలో నేదికోరినను నిత్తునని పలికిన నవ్వుచుఁ గుమారు లిట్లనిరి.