పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

ఒకనాఁ డవ్వతో నీకూఁతురు మదాలసవంటి గుణసంపత్తిగలిగి యున్నదని పలికిన విని యారాజపత్ని మదాలసవృత్తాంత మెట్టిదో చెప్పుమని కోరుటయు నే నక్కథ వారి కిట్లు చెప్పితిని.

వినుండు పూర్వకాలంబున శత్రుజిత్తను రాజు పరాక్రమశాలి యై పుడమిం బాలించుచుండెను. నృపతికి ఋతుధ్వజుండను మహావీరుండు కుమారుఁడుగా నుదయించెను. ఆరాజపుత్రుఁడు బుద్ధిచే బృహస్పతిని రూపంబున మన్మధుని జ్ఞానంబునఁ గపిలుని విక్రమంబున శుక్రునిం దిరస్కరించుచు సమానవయోబుద్ధివిక్రమసారులగు నృపకుమారులతోఁ గూడికొని -

సీ. వితతస్వరంబు లుప్పతిలంగ వీణగై
                     కొని పాడు హాయిగాఁ గొంతసేపు
    మధుర ప్రబంధనిర్మాణ క్రియారత
                     స్వాంతుఁడై యలరారుఁ గొంతసేపు
    దర్శనాగతతపోధనజనారాధనా
                     కుతుకాత్ముఁడై యుండుఁ గొంతసేపు
    సకలశాస్త్రార్థప్రసంగసక్తిదలిర్పఁ
                     గోవిదావళిఁ గూడుఁ గొంతసేపు

గీ. నాగరథసైంధవారోహణప్రచార
   గురువిహారము లొనరించుఁ గొంతసేపు
   క్రూరమృగముల వేటాడుఁ గొంతసేపు
   మానినీభోగవిముఖుఁడై ఱేనిసుతుఁడు

తదీయక్రీడాభిరతి నెఱింగి బ్రహ్మక్షత్రియవైశ్యపుత్రులు దూర దేశములనుండి వచ్చి యతని నాశ్రయించి తిరుగుచుందురు. వచ్చినవారినెల్ల నాదరించుచు నారాజకుమారుండు వారికి క్రీడావిశేషంబులఁ గల్పించి యాడించుచుండును. అశ్వతరుండను నాగేంద్రునికుమారు