పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌశికునికథ.

351

వినక తనతోఁ గలియమని మమ్ముఁ బెక్కు బాములం బెట్టెను వెలయాండ్రకు నీతియెక్కడవని యాక్షేపించెను. మమ్ముఁ గారాగార ప్రాయమైన నికాయంబున నుంచి నిర్బంథించెను. మే మొప్పుకొనలేదు. తరువాత నేమిటికో మీ రిక్కడికిఁ దీసికొనివచ్చితిరి. ఇదియే మాకధయని యాజవరా లెఱింగించుచుండఁగనే నేను మేనుఝల్లుమన నోహో! వీరు నామిత్రులకళత్రములని మనవృత్తాంత మంతయు నతని కెఱింగించితిని.

నాపేరు ఘోటకముఖుండని విని యావనితారత్నములు మేను లుప్పొంగ నేమీ! నేఁ డెంతసుదినము. మీపేరు గోణికాపుత్రుండు చెప్పుచుండఁ బలుమారు వింటిమి. మహాత్మా! మీ రిక్కడి కెట్లువచ్చితిరి? మీయుదంత మెఱింగింపుఁ డనవుఁడు నాకథ వారికి వెండియుం జెప్పితిని. రాజపత్ని వారివృత్తాంతము విని జాలిపడుచు మిమ్ము మీభర్తల యొద్ద కనిపెద విచారింపవలదని యోదార్చినది. నాఁడు ఇష్టగోష్ఠీవినోదములతోఁ గాలక్షేపము గావించితిమి.

అని చెప్పెనని చెప్పువఱకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలికథ తదనంతరనివాస ప్రదేశంబున నిట్లు చెప్పుచుండెను.

________

169 వ మజిలీ.

మదాలసకథ.

చక్రధరనరనాయకునిపత్ని మిత్రవింద చాల గుణసంపత్తిగలది. నే నమ్మఱునాఁడే యిందువచ్చుటకుఁ బయనమైతిని. తనతల్లి కుపకారము గావించితినని నన్ను మిక్కిలి పొగడుచు నారాజపత్ని నన్నట నుండి కదలనిచ్చినదికాదు. దినమున కొకరకము పిండివంటలు సేయుచు నా కత్యంతగౌరవము గావించినది.