పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

ఘోషించుచున్నవి. అందులకు నాకేమియుఁ బాతకములేదు. మఱియు నాతరుణుల యభిప్రాయము ననుసరించి యుపకారము గావించెదనని సమాధానము సెప్పెను. వారిసంవాద మాలించుచు నే నేమియు మాటాడక భుజించుచుంటిని.

అప్పు డాయవ్వ యల్లునితో మీ రీవిషయము తగవులాడనేల ? ఘోటకముఖుండు మహాపండితుండు. ఆయన నడిగి యేది న్యాయమో యట్లు కావింపవలయునని చెప్పినది. రాజు నాదిక్కు మొగంబై, ఆర్యా ! నేఁజెప్పినమాటలలో నన్యాయ మున్న దా? అని యడిగిన నేనది సమంజసముగానున్నది. ఆగణికలయుదంతము దెలిసికొని వారి యాప్తులం జేర్చుట యుచితమని పలికితిని

భోజనానంతరము విశ్రమించినతరువాత రాజు నన్ను వెంటఁబెట్టికొని యాగణికలున్నగదిలోనికిం దీసికొనిపోయెను. మిత్రవిందయుఁ దల్లియు నంతకుముందే యందువచ్చి యాసుందరులతో ముచ్చటించు చుండిరి. రాజు వారింజేరి మీ దేదేశము, ఎవ్వనిభార్యలు, విపులుఁ డేమిటికి మిమ్ము బంధించెను, మీవృత్తాంత మెఱింగింపుఁడని యడిగిన నమస్కరించుచుఁ జిత్రసేన యిట్లనియె.

మహాశయా ! మాజన్మభూమి పాటలీపుత్రము. మేము రతినూపురయను వేశ్యపుత్రికలము. నాపేరు చిత్రసేన ; దీనిపేరు రతిమంజరి. నాభర్త దత్తుఁడను విద్వాంసుఁడు ; దీనిభర్త గోణికాపుత్రుఁడు. మేము తల్లి సంపదల విడిచి గోణికాపుత్రువెంట ధారానగరమున కరుగుచుండ మతంగయోగిని దుర్బోధముచే విపులుఁడను రాజు మమ్ము బలవంతముగా గోణికాపుత్రునికిఁ దెలియకుండఁ దననగరమునకు రప్పించుకొని తన్ను వరింపుమని నిర్బంధించెను.

మేము బ్రాహ్మణుల సొత్తులమైతిమి, మగ నాలులము, వేశ్యాధర్మముల విసర్జించితిమి. మమ్మువరించుట నీకుఁ దగదని యెంతచెప్పినను