పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

348

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

కానేరఁడు. ఈదోసము గరుడపక్షిమూలమున వచ్చుటచే నతని కే విధింతమనిన సర్పమునుదినుట దానికిఁ దప్పుగాదు. ఈపాప మెవ్వరికివిధింపవలయునో మాకునుం దెలియలేదని ధర్మకర్తలు సెప్పిరి.

అప్పుడు యముఁడు సంశయడోలాయితహృదయుండై యాపాప మెవ్వరిపేరను వ్రాయవలదని చిత్రగుప్తులకుఁ జెప్పి వైకుంఠమునకుం బోయి శ్రీమహావిష్ణునికడ నివేదించెనఁట. అమ్మహాత్ముండు గొప్పసభ చేసి యాధర్మసూక్ష్మము చెప్పుఁడని మహర్షుల నడిగెనఁట. దేవతలు మహర్షులుగూడ నాసందేహము తీర్పలేకపోయిరి. శ్రీమన్నారాయణుఁడు లోకములు తిరిగి పెద్దల నరసి యీధర్మసూక్ష్మము దెలిసికొనవలసియున్నది. ప్రస్తుత మెవ్వరికిని విధింపవలదు. దూతలంబంపి మూఁడు లోకంబులంగల పెద్దలతో విచారించి తగినవిధి నాచరింపుమని యముని కాజ్ఞ యిచ్చెను. యముండును ధర్మసూక్ష్మము గ్రహించుటకై తన దూతల లోకములఁ ద్రిప్పుచుండెను.

వైకుంఠములో సభజరగినప్పుడు గరుత్మంతుఁ డావార్తవిని కులస్థులకెల్ల నీయపకీర్తివచ్చినదని పరితపించుచు నీదోస మాపతగమునకు ఘటింపఁజేయుడురేమో యని మిక్కిలి వెఱచుచుండెను. ఆవార్త గరుడ పక్షిజాతికెల్లం దెలిసినది. భూలోకములో నొకవృక్షశాఖలవసించి రెండు గరుడపక్షు లామాటలే చెప్పుకొనుచు నిలిపి నిలిపి చివర కీదురితము మనపక్షి కే విధింతు రేమో యని చింతించుచుండెను.

ఆసమయమువ దైవికముగా నాచెట్టుక్రిందఁ బండుకొనియున్న యొకబ్రాహ్మణుఁ డాపక్షి వాక్యము లాలించి యాభాష తాను జదివి యున్నవాఁడగుట దదర్థముగ్రహించి తనతోనున్న రెండవబ్రాహ్మణుని కాకథయంతయుం జెప్పుచు నీవిషయము దేవతలు మహర్షులు సెప్పలేక పోయిరఁట నన్నడిగిన నేను జెప్పుదునుకాదే యని పలికిన విని రెండవ పారుఁడు నీ విందుల కేమిచెప్పెదవు ? ఆపాప మెవరికి విధింతువని యుడిగిన నతం డిట్లనియె.