పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వింద భర్త కెదురువోయి పాదములుగడిగి శిరంబుపైఁ జల్లుకొనుచు స్వాగతమడిగి నిలువలేక తనతల్లిరాక యెఱింగించినది. ఆప్రభువు మందహాసము గావించుచు ఏమీ ! నీతల్లియేవచ్చినదా ! పశువు లేమగునో గదా ! అని పరిహాసమాడుచుండ నయ్యో ! దాని కెట్టిగండముగడిచినదనుకొంటిరి. ఘోటకముఖుండను పుణ్యాత్మునివలన విముక్తినొందినది. ఆయనగూడ నిందువచ్చిరని యాకథయంతయు జెప్పినది.

ఆవార్తవిని యతం డామె కట్లుకావలసినదే! ఈసారియైన నిందుండునేమో యడిగితివా? ఆపండితుం డెందున్న వాఁడు. అని యడుగుచుండ నాయవ్వ న న్నతనియొద్దకుఁ దీసికొనిపోయి యీపుణ్యాత్ముఁడే నన్ను రక్షించినవాఁడని యెఱింగించినది.

రాజు నాకు నమస్కరించుచు నతం డడుగ వెండియు నావృత్తాంతము భైరవునివృత్తాంతమును జెప్పితిని. ఆఱేఁడు నన్ను మిగుల గౌరవించుచు విద్యలలోఁ గొంతముచ్చటించి నేనిచ్చిన ప్రత్యుత్తరమున, కచ్చెరుపడఁజొచ్చెను. తరువాత మేమిరువురము నొకపంక్తినిగూర్చుండి భుజించితిమి. భుజించునప్పు డతనిభార్య ప్రక్కనిలువంబడి తాళవృంతమున విసరుచు మనోహరా ! విపులుఁడు మీ కంతయవశ్యకముగా రమ్మని వార్తనంపెఁ గారణ మే మనవుడు నతం డిట్లనియె.

లోకమంతయు స్త్రీప్రచారముతోఁ గూడికొన్నది వినుము. విపులుఁడు నిష్కాముండైనను మతంగయోగిని ప్రోత్సాహమున నిరువుర వారకాంతల వరించి వారిని బలవంతమున రప్పించుకొనుటయు నయ్యం గన లంగీకరింపక యల్లరిచేసి యెట్లో భోజునిపుత్రునకుఁ దెలియఁజేసిరి కాఁబోలు. భోజపుత్రుండు చిత్రసేనుఁడనువాఁడు విపులున కిట్టిసందేశమును బంపెను.

రాజా ! రాజు ప్రజల న్యాయాన్యాయంబుల విచారించి దుర్జనుల శిక్షించి సజ్జనుల రక్షించుచుండవలెను. నీ వామాట మఱచిపోయి