పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘోటకముఖునికథ.

341

మీరు మహావిద్వాంసులు. దేశమే మీధనము. నేను మీకు ధనమిచ్చుదానను గాను. వరాహపుర మిక్కిడికిఁ బదియోజనముల దూరములో నున్నది. ఆదీవికి రెండుయోజనములుమాత్రమే సముద్రము దాటవలసియున్నది. నిన్నక్కడికిఁ దీసికొనిపోయి నీవు సేసినయుపకారము మాయల్లునితోఁ జెప్పి వారికిని మీకును మైత్రి గలుపవలయునని యభిలాషయున్నది. ఇదియే నాతలంపు. నాలుగు దినములలో బోఁగలమని పలికిన విని నేను గ్రొత్తవింతలం జూచుతలుపుగలవాఁడనగుట నామెమాట నంగీకరించి నాఁడే పయనము సాగింపుమని కోరితిని.

అప్పు డామె మందయొద్దకుఁబోయి రెండుదున్నపోతుల వెంటఁ బెట్టుకొనివచ్చినది. వానివీపుపై మెత్తనియాకులుఁ జిగుళ్ళును జీనులాగునఁ గట్టినది. ఒక దానిపైఁ దానెక్కి రెండవదానిపై నన్నెక్కుమన్నది. నాకుఁ బక్కున నవ్వువచ్చినది. అంతకన్న వేఱొకసాధనము లేక పోవుట నట్లుచేయక తప్పినదికాదు. ఆ కొండలలోఁ బాదచారియైపోవుట చాలకష్టమఁట. యముఁడంతటిమహాత్ముఁడు దాని యానసాధనముగాఁ జేసికొనియె. మనమాట లెక్క యేమని దానిపై నెక్కితిని. మిత్రులారా! నే నేమనిచెప్పుదును ? గుఱ్ఱములు నేనుఁగుల నెక్కినప్పుడుగూడ నంత సౌఖ్యము గలుగలేదు.

అవ్వ ముందునడుచుచుండ నేను వెనుకఁ బోవుచుంటిని. కుదుపు కొంచెమైన లేదు. చాలవేగముగా నడుచుచుండెను. ఏమియు నదలింప నవసరములేదు. మెట్ట లెక్కునప్పుడు పూర్వకాయము వంచుచుఁ బల్లమునకుఁ దిగునప్పుడు చరమకాయము వంచుచు మాకేమియు నాయాసము లేకుండ నడుచునవి. మూఁడుదినము లట్లు పయనముసాగించి సముద్రతీరముననున్న యొకపల్లె చేరితిమి. ఆమె యొక పల్లెవానింజీరి వరాహపురంబునకు నోడగట్టుమని నియోగించినది వాఁ డప్పుడే యొకచిన్న ప్రవహణము సన్నాహముసేసి తీసికొనివచ్చెను. మేము పెందలకడ భోజనము