పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

340

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గాని దేనినేని తోలికొనిపోయినచో నాపశు వెందున నిలువదు. వెంటనే పారిపోయివచ్చి మందలోఁ గలియును. ఒకయె ద్దొకప్పుడు మూఁడుమాసము లెందోయుండి వచ్చినది. నాయింటనున్న వస్తువులు కుబేరునింట లేవు. నాయల్లు డీవైభవమంతయుఁ జూచినతరువాతనే నాపిల్లను సేసికొనియెను. చాల వింతవస్తువు లాతఁడు తనగ్రామమునకుఁ దీసికొనిపోయెనని చెప్పినది.

ఆపాతాళగేహాలంకారములు చూచి నేను విస్మయము చెందుచు నామెచెప్పినమాటలు విని ఆహా ! అవ్వా! నీవు పైకిఁజూడ వెఱ్ఱిదానివలెఁ గనంబడుచుంటివి. నీవైభవము పెద్దది. నీగుట్టు తెలిసికొని దుర్మార్గులెవ్వరైన బాధింతురేమో? ఈరహస్యము నాకుఁ జెప్పినంజెప్పితివి కాని యితరుల కెన్నఁడును జెప్పరాదుసుమీ? అనవుఁ డాయవ్వ నవ్వుచు నిట్లనియె.

సౌమ్యా ! నీయింగితాకారచేష్టలఁ బరిశీలించి యీగుట్టు చూపితినిగాని యితరులకుఁ జెప్పుదునా నాఁడు మాయల్లుఁడు చక్రధరునకుఁ జూపితిని నేఁడు నీకుఁ జూపితిని. నాఁకూతురుగూడ బాగుగా నెఱుఁగదు. నీవు విద్వాంసుఁడవు చాలమంచివాఁడవని తోఁచినది. నన్ను రక్షించితివి. నీకొక యుపకారము చేయుతలంపుతో నే రహస్యము నివేదించితిని. అని పలుకుచు నాకవాటము మూసి యంతలో వంట జేసి తృప్తిగా భోజనము పెట్టినది. రెండుమూఁడుదినము లందుండి నేను ధాగానగరమునకుఁ బోవలసియున్నది. మఱియు నాతాంత్రికుని శిక్షింపఁజేయవలసి యున్నది. మిత్రులఁగలిసికొని యుపాయ మాలోచించెద. పోయివచ్చెద ననుజ్ఞయిమ్ము, నా కేదియో యుపకారము సేసెదనంటివి.

ధనముతో నాకు నిమిత్తములేదు. మామిత్రులిర్వురు మహారాజులై యున్నవారు. వారిధనమంతయు నాయిచ్చవచ్చినట్లు వాడుకొనవచ్చును. నీయుపచారమునకుఁ జాల సంతోషించితిని. కృతజ్ఞతకు మెప్పువచ్చెనని పలికిన నాయవ్వ యిట్లనియె.