పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘోటకముఖునికథ.

337

యిందువచ్చెను. పండుకొనియున్నవాఁడు ఇంకను లేవలేదు. అని చెప్పితిని. వాండ్రు తొందరపడుచు మహారాజుగా రిందున్నారా? అని యందఱు నందు మూఁగికొనిరి.

అంతలో నతండు లేచెను. నేను మిత్రవిందచేతనే యతని కుపచారములు సేయించితిని. బాబూ ! చెప్పనేల ? నాకూఁతురు చక్కఁదనంబున కతండు వలచి మూఁడుదినము లందుండి కదలఁడయ్యెను. తదీయహావభావవిలాసాదు లతనిహృదయము నాకర్షించినవి. నే నది యెఱింగి యక్కురంగ నయనను సంతత మతనియంతికముననే యుండ నియమించితిని. మిత్రవిందతో సరససల్లాపము లాడుచుఁ జివర కొకనాఁడు మిత్రవిందను దనకుఁ బెండ్లిచేయుమని నాతో సూచించెను. నేను ప్రహర్షసాగరమున మునుఁగుచుఁ బుష్పములతో మిత్రవిందం దీసికొనిపోయి యతనితొడపైఁ గూర్చుండఁ బెట్టితిని. అతండు గాంధర్వవిధి నా వధూరత్నమును స్వీకరించెను. అప్పుడే యప్పడఁతిఁ దనగ్రామమునకుఁ దీసికొనిపోయెను. నేనును దానితోఁబోయి కొన్నిదినము లందుండి వెండియు నింటికివచ్చితిని.

నాకూఁతురు మిత్రవింద వరాహపురంబున భర్తతో స్వర్గసౌఖ్యము లనుభవింపుచుండెను. దానికి జూంబవతి యనుకూతురుమాత్రమే యుదయించినది. అది యట్లుండె న న్నందు రమ్మని యెంతయో నిర్బంధించుచున్నదికాని నా కీభూమి విడిచిపోవ నిష్టములేకున్నది. అప్పుడప్పుడుపోయి చూచి వచ్చుచుందును. ఈనడుమ గడ్డము తలయుంబెంచుకొని జటలతో మహర్షివలె నొప్పుచున్న యొకదుర్మార్గుఁడు పశువులును బక్షులును మృగములును పలురకము లొప్పుచుండ నీయడవిలో నొకనాఁడు బసజేసెను. నే నతనియొద్దకుఁబోయి నమస్కరించుచు మహాత్మా ! ఈ యరణ్యమంతయు నాది. నేను గుత్తకుఁ దీసికొన్నాను. నాకుఁ జాలపశువులు గలవు. మాపచ్చికయంతయు మీపశువులు