పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

అయ్యా ! జన్మభూమి యెంతసంకటమైనదైనను విడువబుద్ధిపుట్టదుకదా ? మా కిక్కడ స్వర్గఖండమువలె నున్న ది. మాకుఁ జాలపశువులు గలవు. వానికిఁ గావలసినంతపచ్చిక యున్నది. మాకుసరిపడిన ధాన్యములు ఫలించును. ఒకరితో మాకుఁ బనిలేదు. నాకు మిత్రవింద యను కూఁతురు గలదు. దానికిఁ బెండ్లిచేయవలసినసమయము వచ్చినది. అనుకూలుఁడగు వరుఁడు దొరకవలయు నిదియే నాకుఁగలిగిన చింత. ఇందులకై మీకు శక్యమైన సహాయముచేయుఁడని పలుకుచు నావృత్తాంతము చెప్పితిని.

ఏదీ ? నీకూఁతురు. ఎన్నియేండ్లున్నవి ? అనియడిగినఁ బండుకొని నిద్రబోవుచున్న ది. యౌవనోదయ మగుచున్నది. చక్కఁదనముగుఱించి నేను జెప్పనవసరములేదు. చూచిన మీకే తెలియఁగలదు. అని పలుకుచు అమ్మాయీ ! మిత్రవిందా ! లేచి యిటురా, అని పిలిచితిని. అది యంతకుముందే లేచి మాసంవాద మాలించుచు నాగదిలోఁ గూర్చున్నది. నామాట విని ఇదిగో వచ్చుచున్నా నని యించుక సిగ్గుదోఁప వచ్చి యొక్క ప్రక్క నిలువంబడినది. దీపమువెలుఁగున దానిసోయగము చూచి యతం డక్కజపడినట్లు నాకుఁదోఁచినది.

బాలా ! పోయి పండుకొనుము. రేపు జూచెదనులే యని పలుకుచు నవ్వా ! నీకూఁతురు మంచిచక్కనిది. మిత్రవిందయేకదా ? యేకృష్ణుఁడో వచ్చి పెండ్లియాడఁగలఁడు, ఇందులకై నీ వాలోచింపవలసినపని లేదని పలుకుచు నతండు నిద్రఁబోయెను. అతని కులశీలనామాదు లేమియు నప్పటికిఁ దెలియవు. మఱునాఁడు సూర్యోదయము కాకపూర్వమే యతని వెదకికొనుచు జతురంగబలములు నాకుటీరము నొద్దకు వచ్చి చక్రధరభూపాలుం డిందువచ్చెనా? అని యడిగిరి.

వారిమాటలచే నతండు ప్రభువని తెలిసికొని విస్మయము జెందుచు వారెవ్వరో నాకుఁ దెలియదు. రాత్రి యొకపురుషుండు జడిగొట్టి