పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘోటకముఖునికథ.

333

కొనిపోయి సరస్వతీప్రముఖయువతీమతల్లికలతో వారితెఱం గెఱింగించి పరిచయము గలుగఁజేసెను.

ఆయంతఃపురకాంతలు వారిసోయగము వింతగాఁ జూచుచుఁ దమకుఁగలబంధుత్వము వారికిఁ దెలిపి వారివృత్తాంత మడిగి తెలిసికొని తదీయమనస్థైర్యమున కాశ్చర్యపడఁజొచ్చిరి. కుచుమారుండు ఘోటకముఖుంజూచి వయస్యా! నీవు నాఁ డామిత్రునితోఁ గూడికొని పురందరపురమునుండి యరిగితివిగదా! ఎందెందు సంచరించితివి? ఏమేమివింతలఁ జూచితివి? సవిస్తరముగాఁ జెప్పుము. నీతో వచ్చినపురుషుఁ డెవ్వఁడో తెలిసికొంటివా ? యని యడిగిన ఘోటకముఖుం డిట్లనియె.

మిత్రులారా ! నాతోవచ్చిన పురుషుఁ డెవ్వఁడో నా కిప్పటికిని దెలియదు. ఏకశిలానగరంబున కరుగుచుండ నొకయరణ్యమధ్యంబున భైరవుఁడను తాంత్రికుఁడు మాకుఁ గనంబడియెను. ఆపురుషుని భార్యను హరించినమాయావి వాఁడేయని తెలిసికొని మేము నిలునిలుమని పలుకుచు వాని కడ్డమై యాపితిని. వాఁడు తనపరివారమును గేక పెట్టెను. పదుగురు దుడ్డుకఱ్ఱలుతీసికొని మాపైకి వచ్చిరి. మేము నిరాయుధులమగుట వారికి వెఱచి పారిపోవఁ బ్రయత్నించుచున్న సమయంబున నాక్రూరాత్ముఁ డాపురుషునిఁబట్టికొని నెత్తిపై నేది యోపసరు రుద్దెను. అంతవట్టు చూచితిని. తరువాత నతండు గనంబడలేదు. వాఁడు నామీఁదికి వచ్చునని యటుచూడక డొంకలమాటుగా నవ్వలికిఁ బోయితిని. ఒక కుడుంగముచాటున ఘోటక మొకటి మేయుచుండెను. అది వానిమృగ సంఘమునుండి తప్పించుకొని యందు మేయుచున్నది. దానింజూచి వేఱొకయుపాయము దోఁపక గుఱ్ఱమునెక్కుపాటవము గలదు కావునఁ దటాలున దానిపై కెక్కి కళ్ళెము జీను లేకుండఁగ నేనడిపింపదొడంగితిని. ఆహయంబు రయంబున నందుఁగనంబడినమార్గంబునంబడి పోవఁదొడంగినది.