పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వాఁడు వెనుకనుండి తఱిమికొనివచ్చునని వెఱపుతో మిక్కిలి వేగముగాఁ దోలితిని. అదియుఁ బశ్చిమోత్తరముగాఁ బోయి పోయి యా యడవిలో నొకగుడిసియొద్ద నిలువంబడినది. అప్పటికి జాముప్రొద్దున్నది. నాకు దాహమగుచున్న ది కావున నాకుటీరమునందు మనుష్యు లుందురనితలంచి గుఱ్ఱముదిగి తలుపుదగ్గరకుఁ బోయి లోపల నెవ్వరండో యని యఱచితిని. ప్రతివచనమేమియు వినఁబడలేదు. తలుపునకు బీగములేదు. త్రోసినంతనే తెఱువఁబడినది. లోపలికిఁబోయి నలుమూలలు సూచితిని. ఎవ్వరుఁ గనుబడలేదు. స్వల్పముగా సామాగ్రి యున్నది. తిన్నగాఁ బెరటిలోనికిం బోయితిని. అప్రాంతమందొకనూయి యున్నది. తోడికొనుటకుఁ జేద యున్నది. దానితో నీళ్ళుచేదుకొని యమృతోపమానంబులగు తజ్జలంబులు కడుపునిండఁ ద్రావితిని. తిరుగా లోపలికివచ్చి నలుమూలలు పరికింప నొకగది బీగమువేయఁబడియున్నది. ఇందలివా రెందుఁబోయిరో యని యాలోచించుచు వాకిటకు వచ్చితిని. ఆయశ్వ మందే నిలువంబడి యున్నది. నన్నుఁజూచి సకిలించినది.

అప్పుడు నేను దానిదాపునకుఁబోయి మోము దువ్వుచు లక్షణములు పరిశీలింపుచుండ దానిమెడలో నేదియోతాయెత్తు గనంబడినది. దానింద్రెంపి పారవైచితిని. ఆగంధర్వం బంతలో నదృశ్యమై యొక ముసలమ్మయై నిలువంబడినది. ఆమెం జూచి నేను వెఱఁగుపడుచు, అవ్వా! నీవెవ్వతవు ? ఇట్లు గుఱ్ఱమవై యుంటివేల ? నీవృత్తాంతము సెప్పుమని యడిగిన నాయవ్వ యిట్లనియె.

బాబూ! ఈకుటీరము నాదే. ఈప్రాంతభూమి తృణకాష్టజలసమృద్ధి గలిగియున్నది. మేము సారస్వతబ్రాహ్మణులము. నాభర్తతో నే నీకుటీరమునఁ బెద్దకాలము కాపురముసేసితిని. పశువుల మేపుకొనుచు వ్యవసాయముచేసి జీవించువారము. నాభర్త చనిపోవునప్పటికి నాకొక కూఁతురుగలదు. దానికి మూఁడేండ్లున్నవి. భర్తృమరణానంతరముగూడ