పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

168 వ మజిలీ.

ఘోటకముఖుని కథ.

మఱునాఁడుప్రొద్దుట గోనర్దీయ, కుచుమార, గోణికాపుత్ర, సువర్ణనాభ, చారాయణులు మిత్రులేవురును నాయింటిచావడిలోఁ గూర్చుండి దత్తకఘోటకముఖుల రాకనుగుఱించి ముచ్చటించుకొనుచుండఁగాఁ బ్రతీహారి చనుదెంచి దేవా ! ఘోటకముఖుండఁట బ్రాహ్మణుం డొకండు బండిమీఁద నిరువురుస్త్రీలతో వచ్చి వాకిట నిలువంబడియెను. మీదర్శనము సేయఁగోరుచున్నాఁడు. సెల వే మనవుఁడు నైదుగురును దటాలున లేచి మాప్రాణమిత్రుఁ డేఁడీ ? అనిపలుకుచు గుమ్మమునొద్దకుఁ బోయిరి.

అతండు వారింజూచి మోము వికసింప నోహోహో! నేఁటికిఁ గృతకృత్యుండనై తినని పలుకుచు వారిం గౌఁగిలించుకొనియెను. వారును బ్రత్యాశ్లేషము గావించి లోనికిఁ దీసికొనిపోయిరి. అప్పుడు గోణికాపుత్రుఁడు బండిమీఁదనున్న యాఁడువాం డ్రెవ్వరని యడిగిన నయ్యో! వారిమాట మఱచితినే ! వారు రతిమంజరీచిత్రసేనలను వేశ్యాపుత్రికలు. ఔరా ! నీతోఁ గ్రొత్తగాఁ జెప్పుచున్నా నే. అందొకతె దత్తుని భార్య. ఒకతె నీభార్య. పాపము వాండ్రు మనమూలమునఁ జాలయిడుములం గుడిచినారని చెప్పుచుండఁగ నే గోణికాపుత్రుండు ఆఁ ! ఏమేమీ! రతిమంజరీచిత్రసేనలే యని పలుకుచుఁ దటాలున లోనికింబోయి బండిలోనున్నవారిద్దఱం గాంచి తద్దయుంబ్రీతి నబలలారా! వచ్చితిరా ? మీనిమిత్తమై భూమి తలక్రిందు సేయఁదలఁచుకొన్నాము. కానిండు. లోపలికి రండు. మనవారందఱు నిందున్నారని పలికిన నక్కలుకులు కనుఁగొలుకుల నశ్రుజలకళికలు రాల నతనిం జూచుచుఁ హృద్గతంబగు శోకమును వెలిబుచ్చిరి. వారి నూఱడింపుచు గోణికాపుత్రుండు లోపలికిఁ దీసి