పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

దూరము రాకుందురుగదా? అతండు విద్యలసృష్టించిన మహానుభావుండు. ఈసంస్థానపండితులలో నతండే ప్రముఖుండు. అతఁడే మీకు ప్రతివాదిగా నుండఁగలఁడు. మాధ్యస్థుని మీరు కోరుకొనుఁడు. అనిపలికి కూర్చుండెను.

ఆమాటవిని గోనర్దీయుఁడు లేచి విద్యాస్వరూపుండగు కాళిదాస కవిసార్వభౌమునిమహిమను మే మీదివఱ కే వినియుంటిమి. భూమండలమంతయుఁ దద్యశోవిసరములు వ్యాపించియున్నవి. ఆయనతోఁ బ్రసంగింప మేముకాదు వాణీధవుండైన సమర్ధుండుగాఁడని చెప్పఁగలము. ఆయనకు మావిద్యాపాటవము జూపి మెప్పుబడయవచ్చితిమి గాని గెలుపుగొనుటకుఁ గాదు అందులకే యనుజ్ఞనీయ వేఁడుచున్నాము. అని పలుకుటయు సభాసదు లామాటలువిని కాళిదాసకవి యిందుల కేమని ప్రత్యుత్తరమిచ్చునో యని చూచుచుండిరి.

అప్పుడు భోజుండు లేచి కుచుమారగోనర్దీయాదిపండితులచరిత్రము లోకాతీతమైనది. కాళిదాసమహాకవి త్రిభువనైకవంద్యప్రభావ సంపన్నుఁడు. వారు ప్రసంగింప మాధ్యస్థముసేయటకుఁ దగినవిద్వాంసుం డుండవలదా? భారతియో భారతీపతియో కావలయు, నట్టిసమర్థుండు దొరకువఱకు నావాదము నిలుపుమని కోరుచున్నాను. తక్కిన పండితులు ప్రసంగింపవచ్చునని యానతిచ్చెను. తదానతి శిరసావహించి గోనర్దీయాదు లేమియు మాటాడలేదు.

తరువాత నితరపండితులప్రసంగములు చాల జరిగినవి. పెక్కండ్రకు బిరుదములు కానుకలు వేనవేలు పంచిపెట్టిరి. సభ ముగిసినతరువాత భోజుండు గోనర్దీయకుచుమారులఁ బ్రత్యేకముగాఁ బ్రశంసింపుచు మిమ్ము నేను బురందరపురములోఁ జూచితిని. జ్ఞాపకమున్నదా ? అని యడిగినఁ గుచుమారుండు మిమ్ముఁజూచినప్పుడే తెలిసికొంటిమి. అప్పుడు మీకులగౌరవనామముల మఱుఁగుపఱచితిరి. మీతో మామి