పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

327

జరుగును. విద్వత్సభకు మీరురానిచో సమంజసముగా నుండదు. ఎట్లయినను దయచేయకతీరదని బలవంతపెట్టెను. నృపతి యంగీకరించి యా సభాసమయంబునకు పోయి సభ నలంకరించెను.

అందొకమూల కుచుమార గోనర్దీయ చారాయణ సువర్ణ నాభ గోణికాపుత్రులును మఱొకవైపున దండి భవభూతి శంకరప్రభృతిమహా కవులును భోజునకు ప్రక్కనున్నపీఠముపైఁ గాళిదాసమహాకవియును నాప్రాంతములయుదు. నానాదేశాగతవిద్వత్కవులును గూర్చుండిరి. అప్పుడు భోజుండు లేచి విద్వద్బృందమున కెల్ల నమస్కరించుచు మద్భాగ్యవశంబున నేఁ డీసభకు మహావిద్వాంసులెల్లరు విచ్చేసి నన్నుఁ గృతార్థుం గావించిరి. మీమీప్రసంగముల విని శ్రోత్రానందము గావించికొనియెదంగాక. మీ రన్యోన్యము మత్సరగ్రస్థులుగాక విద్యావైభవములు దేటపడఁ బ్రసంగింపఁ గోరుచున్నాఁడను. ఎవ్వరెవ్వరితోఁ బ్రసంగింప నభిలాషగలిగియున్నదో ప్రకటించినచో నందులకుం దగినమాధ్యస్థు నేర్పఱతుము. అనిచెప్పి కూర్చుండెను.

అప్పుడు కుచుమారుండు లేచి మహారాజూ ! మేము కాశీపురంబునఁ జదువుకొంటిమి. మీసంస్థానపండితుల ప్రఖ్యాతి విని వారితోఁ బ్రసంగింప వేడుకగలిగి వచ్చితిమి. మే మేడ్వురము సహాధ్యాయులము. మా కన్ని విద్యలయందును బాండిత్యము గలిగియున్నది. ఇందు మే మేవుర ముంటిమి. మాలో నెవ్వరితోనైననుసరియే మీసంస్థానపండితులలోఁ బ్రముఖునిఁ బ్రసంగించుటకు నియమింపవలయును. ఇదియే మా యభీష్టమని పలికిన విని శంకరకవి లేచి యిట్లనియె.

అయ్యా ! నీమాటలు గడు గర్వభూయిష్ఠములై యున్నవి. కాశీపురమునుండి ప్రత్యేకము భోజభూజాని యాస్థానమునఁ గవులతో ముచ్చటింప నుత్సుకతఁజెంది వచ్చితిమని చెప్పితివి. నీయుత్సాహము వీరు దీరుపఁగలరు. కాళిదాసకవిప్రవరునిప్రభావము మీరు వినినచో నింత