పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

సత్కార మెవరుసేయఁగలరు? అదియట్లుండె నొకనాఁ డొకపురుషుండు తురగమెక్కి వచ్చుచు నెఱుఁగకయో యెఱిఁగియో భర్తృదారిక విహరించునుద్యానవనములోనికిం బోయెను. ద్వారపాలకు లాటంక పఱచినను నిలువఁడయ్యె.. ఆవార్త నామెకుం దెలియఁజేయ నాహయంబెక్కి వచ్చినది మచ్చెకంటిగాని పురుషుండుగాఁడని తమ్ము గద్దించి యాతనిఁ దనబండిలోనెక్కించుకొని యంతఃపురమునకుఁ దీసికొనిపోయినదని వాండ్రు మాతోఁ జెప్పిరి. ఆవిషయము విమర్శింప మేము కుమారరాజుగారిని బ్రార్థించితిమి. ఆయన సోదరీనికాయంబున కరిగివచ్చి యది యాఁడుదియే యని నిర్ధారణసేసిరి. ప్రతీహారులు మఱికొందఱు రాజభటులు ఘోటకారూఢుఁడు పురుషుఁడేగాని స్త్రీగాదని వాదించుచున్నారు. ఇదియే దేవరయరిగినవెనుక జరిగిన యభియోగసందేహమ). అని చెప్పినవిని యజ్జనపతి తనమతిం బత్రికావిషయము సత్యమేమోయని సందేహ మంకురింపఁ గలంకముజెందుచు నొక్కింతతడవు ధ్యానించి కానిమ్ము ఆవిషయ మానక విమర్శింతముగాక యిప్పుడు నీవు వచ్చినపని యేమో చెప్పుమని యడిగిన నాప్రగ్గడ యిట్లనియె.

మహారాజా ! నేఁడు విద్వత్సభ జరుగుటకు నియమించితిమి. దూరదేశములనుండి మహాపండితులును గవీశ్వరులును బెక్కండ్రు వచ్చియున్నారు. కొందఱు కాళిదాసకవితోఁ బ్రసంగించుటకు నుత్సాహపడుచున్నారు. కాళిదాసకవి సరస్వతియపరావతారమని యెఱుంగక యతనికి శాస్త్రములేమియు రావనియు కవిత్వముమాత్రము జెప్పఁ గలఁడనియు వాదించుచున్నారు. దేవర వా రాసభకు విచ్చేసి వాదిప్రతివాదుల నిరూపింపవలయును. మాధ్యస్థుల నేర్పఱుపవలయును. అని యెఱింగించిన భోజుండు నిమీలితనయనాంభోజుండై అయ్యో ! నేఁడే తత్ప్రసంగము బెట్టితిరా? నామనసు దిరముగాలేదు. భైరవునిమాట యేమైనది ? అనుటయు నతండు భైరవునియాట ఇఁక మూఁడుదినములలో