పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

325

మంతఃపురము విడువక క్రీడాభిరతుండై రాజకార్యముల విమర్శింపఁ డయ్యె. నీకూఁతురు రుక్మిణికి నెలతప్పెనని చెప్పుకొనుచున్నారు. ఈ రెండు విషయములం బరీక్షించిన నీకే తెలియఁగలవు. నీ కాప్తులమగుట నట్లు తెలుపుటకుఁ జింతిల్లుచున్నాము.

ఆపత్రికంజదువుకొని ధాత్రీపతి కలుద్రావినకోఁతివలెఁ జికాకు వడుచు నక్కటా ! నా కింటికివచ్చిన నన్నియు దుఃఖములే కలుగుచున్నవి. అందులకే పెద్దలు సంసార మతిగహనమని చెప్పిరి. నాసంస్థాన మందు దుర్మార్గులు బెక్కండ్రు గలరని తోఁచుచున్నది. వెనుక లీలావతినిగుఱించియు నిట్లే వ్రాసిరి. ఇదియు నసత్యమేయని తలంచెదను. నరు లసూయాపరులుగదా? అని తలంచుచున్న సమయంబునఁ బ్రతీహారి చనుదెంచి దేవా ! ముఖ్యాదూత్యుండు వచ్చియున్నాఁడు. ప్రవేశమునకు సెలవా ? యని యడిగి తదనుజ్ఞఁగైకొని యతనిం బ్రవేశపెట్టెను.

ప్రధాని నమస్కరించుచు పర్యంకముదాపుననున్న పీఠముపైఁ గూర్చుండి దేవరవా రస్వస్థులైయున్నట్లు కనంబడుచున్నారు. ఇదియంతయుఁ బయనపుబడలిక గావలయును. అని సమయోచితముగాఁ బల్కరించుటయు నాపుడమియొడయండు శయ్యపైఁగూర్చుండి పయనమన నేల ? జన్మయే బడలిక. కానిమ్ము, నేనులేనప్పుడు చిత్రసేనుండు రాజకార్యముల నేమైన విమర్శించెనా ? పండితుల నాదరించెనా ? వానిప్రవర్తన మెట్లున్నదో సత్యము జెప్పుము. మఱియు సందేహాస్పదములైన యభియోగము లేమైనం దేఁబడినవా ? అనియడిగిన నించుక జడుపు దోఁప నాప్రధాని యిట్లనియె.

దేవా ! దేవరయరిగినదిమొదలు భర్తృదారికునకు శరీరములో నన్వస్థత కలిగినది. దానంజేసి సంతతము శుద్ధాంతమునందే వసించి యుండిరి. రాజకార్యము లంతగా విమర్శించుట కాయన కవకాశము గలిగినది కాదు. తగురీతి మేమే పరిష్కరించుచుంటిమి. దేవరవలె పండిత