పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

అమ్మహానుభావుని చరిత్రమంతయును నేను జదివితిని. ఈమాలిక తదస్థి జాలమే. తత్ప్రభావంబుననే వశిత్వవిద్యాప్రౌఢిమ సంపాదించితిని. ఆభైరవునిఁ బరిభవించుట నాకు గోటిలోనిపని. అందుల కెవ్వని నాశ్రయింప నవసరములేదు. అదియట్లుండెఁ బురందరపురములో ఘోటకముఖుండు మమ్ములం గలసికొనియెను. ఒకస్నేహితునిపనిమీఁదఁ దిరుగుచుంటినని మాతో నప్పుడు చెప్పెను. ఆస్నేహితుండు భోజుండైనట్లు మా కిప్పటికి తెల్లమైనది. ఆమిత్రుండు భోజుండని ఘోటకముఖుండును నెఱుంగఁడు. వానివృత్తాంతము భోజునకుఁ దెలిసియుండును. అతనినడిగిన నంతయుం జెప్పఁగలఁడు. అని యుపన్యసించెను.

అప్పు డాగోనర్దీయుఁడు మల్లికాప్రభృతయువతీమతల్లికల నప్పుడే యక్కడకుఁ దీసికొనివచ్చుటకై శిబికాశకటాదియానములతోఁ బెక్కండ్ర రాజభటులతో మిత్రుల నందంపి వారినెల్లఁ దమ నెలవునకు రప్పించికొనియెను. అని యెఱింగించువఱకు.

167 వ మజిలీ.

భోజభూపతి లీలావతిమందిరమందే వసించి యామెం దలంచుకొని దుఃఖింపుచుండెను ఆపరితాపము చెప్పికొనఁదగిన యాంతరంగిక మిత్రుఁ డెవ్వఁడును లేఁడు. కాళిదాసకవి నవమానించుటుజేసి మునుపటివలె నాయనతోఁ జనువుగా మాటలాడుటకు సిగ్గుపడుచుండును. వేడి నిట్టూర్పుల నిగుడింపుచు శయ్యపై దొర్లుచుండ నతనిగాత్రంబు నొక పత్రిక నొత్తుటఁయు నదియేమియోయని యెత్తిచూచెను. అం దిట్లు వ్రాయఁబడియున్నది.

రాజా ! నీవు విదేశమున కరిగినవెనుక నీసంతానము గంతువిలాసములకులోనై ప్రవర్తించెను. నీకుమారుం డొకవారకాంతతో సంతత