పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

321

లీలావతి యాచరితము విని అయ్యో ! అతం డెవ్వఁడో తెలిసికొనలేదా? ఎందుఁబోవును ? వాని కులశీలనామంబు లడుగలేదా? ఇది వినినవారు పరిహసింపకమానరు. కాని రుక్మిణీయం దేమియు దోసములేదు. దైవికముగా సంపర్కము గలిగినవానినిఁ బరిగ్రహించుట దూష్య మెట్లగును. ఆదివ్యపురుషుండు పుత్రునైనఁ జూచుటకు రాకుండునా?

అని సమాధానముగాఁ బలికినది. రేవతి అమ్మా! ఆతని కులశీలనామంబులఁ దెలిసికొనలేదుగాని వానిచిత్రఫలకము వ్రాసికొంటిమి. ఇదిగో చూడుము. అని యొకప్రతిబింబ మామె కందిచ్చినది. లీలావతి తదీయరూపలావణ్యాదివి శేషంబుల కచ్చెరువందుచు రుక్మిణి చాల చదువుకొన్నది. సామాన్యుని వరించునా ? అనుకూలవాల్లభ్యంబే లభించినదని సంతసించినది.

అంతలోఁ బ్రొద్దుపోవుటయు రుక్మిణి వారలెల్లరకుఁ జెప్పి తల్లికి నమస్కరించి యెల్లి మరల వత్తునని చెప్పి గూఢముగా బండియెక్కి యింటికిఁ బోయినది. లీలావతిచేతినుండి యాచిత్రఫలకమును, మల్లిక యందుకొని వింతగాఁ జూచుచు యక్షకాంతలచెంత నిడినది. వారును దానిసౌరునకు వెఱఁగందుచుండ సువర్ణనాభుం డదియందుకొని యో హోహో ! వీఁడు మాదత్తుఁడు, దత్తుఁడు అని కేకపెట్టెను. చారాయణుండు జూచి ఔను. ఇది దత్తునిరూపమే. దీని నెవరుతెచ్చిరని యడిగిన మల్లిక, రాజపుత్రికసఖురాలు రేవతి లీలావతి కిచ్చినదని చెప్పినది. ఆ మాటవిని సువర్ణనాభుండు ఓహో ! ప్రేయసీ ! దత్తుఁడన నెవ్వఁడో యెఱుంగుదువా? మనకు మీయక్కయు బావయు నున్న యిక్క నెఱింగించిన పుణ్యాత్ముఁడు. నాప్రాణమిత్రుండు. వాఁడెందెందో సుందరియై శాపఫలం బనుభవింపు చున్నాఁడు. వానిని దెలిసికొనవలయును అని పలికెను.