పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నవనంబునకుఁ బోవుసమయంబున మఱియొకశకటంబుదెచ్చి యందుఁ గూర్చుండఁబెట్టి యొరులెఱుంగకుండ లీలావతియున్న భవనంబునకుఁ దీసికొనిపోయిరి.

లీలావతియు యక్షకాంతలును మల్లికయును రుక్మిణిరాక విని యామెనుజూచుట కత్యంతసంతోషము జెందుచుండ నయ్యండజయానవచ్చి లీలావతియడుగులంబడి దుఃఖించినది. రాజపత్ని పుత్రికం గ్రుచ్చి యెత్తి కన్నీటిధారచేఁ దచ్చిరంబు దడుపుచు అమ్మా ! దుఃఖింపకుము. నాకొఱకుఁ బరితపించు దానవు నీవొక్కరితవే. దైవప్రతికూలదినములలో మన మేమి చేయఁగలము. ఎప్పటికైన మంచిదినములు రాకపోవునా ? వీరు యక్షకాంతలు. నాతోఁగూడ నిడుమలం గుడుచుచున్నారు. ఈరత్న పదిక భర్తయే న న్నా భైరవధూర్తునివలన విడిపించి రక్షించెను. ఉపకారమునకుఁ బోవ నపకారమైనట్లు మానిమిత్త మతం డెందో చిక్కువడెను. వీరికతంబున నే నీయూరు సేరఁగలిగితిని. అని తనవృత్తాంతము కొంత కొంత వివరించినది.

యక్షకాంతలసౌందర్యముపకు రుక్మిణియు రుక్మిణిచక్కఁదనమునకు యక్షకాంతలును నక్కజము జెందుచు నొండొరులు స్నేహము గలుపుకొని ముచ్చటింపజొచ్చిరి. ఆసమయంబున లీలావతి రేవతితో జనాంతికముగా నోసీ ! రుక్మిణిమొగము వేఱొకలాగున నున్నదేమో! పెండ్లియైనదా యేమి? దౌహృదచిహ్నములు గనంబడుచున్న వే ! యని మెల్లగా నడిగిన నది యించుకసిగ్గుతోఁ దలయూచుచుఁ దల్లీ ! నీతో నేమని చెప్పుదును. నాటకములో నిది యొక యంతర్నాటిక. నీకూఁతురు గంధర్వప్రాయుఁడగు నొక దివ్యపురుషుని గాంధర్వవివాహమునఁ బరిగ్రహించినది. ఆగంధర్వుండు గంధర్వుండేయై మఱలఁ గనంబడలేదు. అని యావృత్తాంతంబు సంక్షేపంబుగా నెఱింగించినది.