పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

కిరణములు సోకినంత నామెకు మెలకువవచ్చినది. మేము చోరులమనుకొనినది. వస్తువులన్నియుం దీసికొని తన్ను భర్తతోఁ జేర్పుఁడని మిక్కిలి దైన్యముతోఁ బ్రార్థించినది. మేము దుఃఖించుచు నందల మొకచోదింపి మీయాజ్ఞాపత్రికం జూపితిమి. చదివికొని హా! ప్రాణేశ్వరా ! యని పలుకుచు నేలంబడి మూర్ఛిల్లినది.

మేముచేయు నుపచారములవలనఁ బెద్దతడవునకు లేచి నలు దెసలు జూచి ఆ? ఏమి ! నాకిది స్వప్నమా? ఇట్టి పాడుస్వప్నము వచ్చినదేమి? నేనీ యడవి కెట్లువచ్చితిని? నాజీవితేశ్వరుఁడు నన్నీయడవిలో విడిచిరమ్మని మీకు నియమించెనా? చీ చీ యెంతమాట పలికితిరి ! ఆదయాశాలి సుగుణఖని నిరపరాధిని నన్నేమిటికి విడుచును ? నే నేమితప్పుచేసితిని? అది వట్టిబూటకము. కలలోవార్త. మామాటయుఁ గలలోనిదేయని పలికిన మేము తిరుగాఁ దమశాసనము చదివి వినిపించితిమి. అబ్బా ! అప్పు డాతల్లిపడినదుఃఖమును మేము చెప్పఁ జాలము. పెద్దయెలుంగున నడవిప్రతిధ్వను లిచ్చునట్లు శోకించినది. మాకుఁగూడ నేడుపువచ్చినది. తన్నుఁ జంపి పొండని మమ్ము బ్రతిమాలినది. మేమేమని యూరడింపము? విడువలేక విడువలేక యెట్టకే మేము బయలుదేరివచ్చుచుండఁ దమకిమ్మని యీపత్రికలో నేదియో వ్రాసియిచ్చినది. చూచుకొనుఁడని యది చేతికిచ్చిరి. అత్యంతాసక్తితోవిప్పి యతండిట్లు చదివెను.

సీ. ప్రాణేశ యడవిలోపల నన్ను విడిపించి
                 నందుల కెద జింతనొందనేను
    బంధువిహీననై బలవంతముగ మేను
                 విడుతు నట్టడవి నంచడలనేను
    సర్వసంపదల శాశ్వతసుఖంబనుభవిం
                 పగలేదటం చింత వగవనేను