పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుని కథ.

21

కనికి - అందులకే నేనునుం జెప్పితిని. మొదట నేను జేసిన పనివలన రాజుగారికి బాగుగా ననుమానముగలిగి యున్నది. చివరపని బుచ్చి వెంకికి మాటదక్కినది. కానుకలన్నియు దానికేవచ్చినవి.

బాపి - రాజుగారికి నిజము తెలియఁజేయుదునని బెదరింపలేక పోయితివా?

కనికి - దానంతట యదే బయలఁబడఁగలదు. మహాపతివ్రత నడవులపాలు సేసినందులకు ఫల మనుభవింపక పోవుదురా?

బాపి - (నవ్వుచు) అంతయెఱిగినదానవు మొదట నీవేలపూను కొంటివి?

కనికి -- గొప్పవారికి నీతియుండవలెఁగాని మనకేమి ? నేను గాకున్న మఱియొక తె సిద్ధపడును.

బాపి - అవును. ఆమాటయు నిజమే. అదిగో యెవ్వరో వచ్చు చున్నారు. పదపద. అని మాట్లాడికొని యిద్దఱు నిష్క్రమించిరి.

ఆమాటలన్నియు దైవికముగా రాజుగారి, చెవినిబడినవి. వారిద్దఱు నిరపరాధులని యతని హృదయమునందు బాగుగా సచ్చినది. ఏమిచేయుటకుఁ దోఁపక గదిలో మంచముపైఁ బండుకొని వారిచర్యల దలంచుకొనుచు నేడువఁ దొడంగెను. కొంతసేపునకు లేచి లీలావతి నడవికిఁ దీసికొనిపోయిన పరిజనుల రప్పించి యోరీ ! నాప్రియురాలి నేమిచేసితిరి? ఎందువిడిచితిరి? తిరుగా నాకావర్తమాన మేమియుం జెప్పితిరి కారేమి ?

అని యడిగిన వాండ్రు దేవా ! దేవరదర్శనార్ధమై నాఁడే వచ్చితిమి కావలివారలు లోపలికిఁ బోనిచ్చిరికారు. మీయాజ్ఞానుసారము మత్తుమందు వాసనజూపించి మై మఱచియుండ యామె నందలముపైఁ బండుకొనఁబెట్టి మన నగరమున కుత్తరముగానున్న మహారణ్యమునంబడి తెల్లవారువఱకుఁ బెద్దదూరము పోయితిమి. సూర్య