పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

317

చారా - ఇప్పు డామె బ్రతికివచ్చిన నతం డంగీకరించునా ?

రేవ - చచ్చినవారు బ్రతుకుటెట్లు ? మీ రామెవిషయమై గ్రుచ్చి గ్రుచ్చి యడుగుచున్నారు. ఆమె బ్రతికియున్నదా యేమి ? బ్రతికియున్న చో రాజుగారిమాట చెప్పఁజాలనుగాని మారుక్మిణి ప్రహర్ష సాగరంబున మునుఁగఁగలదు.

చారా - నే నామాటయే వింటిని. ఆమెయు నట్లే చెప్పినది. అందులకే నీకడ కరుదెంచితిని. అదియే నీవలనఁ గాఁదగినపని.

అనుటయు రేవతి యుబ్బుచు నేమేమీ ! ఆమె యన్నట్లే యన్నదంటిరి. ఆమె యెందున్నది ? ఎట్లుబ్రతికినది ? ఆమెవృత్తాంతము చెప్పిన మీకు పదివేలనమస్కారములఁ గావింతును. ఈవార్త మారుక్మిణి వినినఁ దనజన్మావధిలో నింతసంతోషము మఱియొకటిఁ బొందనేరదు. నిజ మెఱింగింపుఁడని ప్రార్థించినది. అతఁడు మెల్లగా నామె బ్రతికేయున్న ది. నూఱేండ్లు బ్రతుకఁగలదు. ఈపురమునందే యున్నది. ఈరహస్యము నీకుఁ జెప్పిరమ్మన్నది. తరువాతకృత్యమునకు నీవును నీసఖురాలు రుక్మిణియునుఁ బ్రమాణములు. అనిచెప్పిన నప్పడఁతి బాబూ ! మీ రిందుండుఁడు. రుక్మిణి కీశుభవార్త స్పెప్పివచ్చెద ననిపలికి యత్యంతవేగముగా నంతఃపురమున కరిగి యావృత్తాంతము రుక్మిణి కెఱింగించినది.

ఆఁ ! ఆఁ ! ఏమీ ! ఈమాట సత్యమే ! అని రుక్మిణి విస్మయ సంతోషము లభినయించుచు నావార్త చెప్పినందులకుఁ దనచేతిరత్న కంకణము దానికిఁ గానుకగానిచ్చుచు నామె యెందున్నదో నీవు స్వయముగాఁబోయి చూచివచ్చి చెప్పుము. నాకు నమ్మకము కుదురకున్నది. అని తొందరపెట్టుటయు నాకుందరదన యమందగమనంబున నాధరణీ బృందారునికడ కరుదెంచి వందనముసేయుచు పదుఁడు. పదుఁడు. నా కయ్యిందువదనం జూపుఁడు అని పలికినది. అతండు రేవతిని వెంటఁబెట్టుకొని తనయింటికిం దీసికొనిపోయి లీలావతియెదురం బెట్టెను.