పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

హ్మణభక్తి నీయందు మూర్తీభవించియున్నదని చెప్పిరి. అందుల కే నీ కిట్టి రాజావలంబనము గలిగినది. రాజపుత్రిక నీకు ప్రాణమిత్రమఁట సత్యమేనా ?

రేవ -- అవును. ఆమెకు నాయందనుగ్రహమే నన్నింత మీరు పొగడుట కర్హురాలనుగాను. కింకరురాల. కర్తవ్యమునకు నియోగింపుఁడు.

చారా -- మఱేమియును లేదు. రాజుగారికి నలుగురుభార్యలని వింటిమి. పెద్దభార్య లీలావతి యెందున్నదో యెఱుఁగుదువా?

రేవ - (నోరుమూసికొని) బాబూ! అది రహస్యము. ఎఱిఁగి యున్నను నామాట జెప్పుకొనఁగూడదు. ఇప్పు డామెప్రస్తావముతో మీ కేమిపనిగలిగినది ?

చారా - పనిగలిగియే యడుగుచుంటిని. ఇక్కడ యితరులెవ్వరును లేరు. నిజము చెప్పవలయును.

రేవ - (మెల్లగా దిక్కులుసూచుచు) రాజుగారి కేమిటికో కోపమువచ్చి యామె నడవికిఁబంపి చంపించిరఁట. ఇది పరమరహస్యము. నే నంటినని యెవ్వరితోఁ జెప్పఁగూడదు.

చారా - అయ్యో ! పతివ్రతాశిరోమణియగు నామెయందును దప్పులు గణించెనా ? ఆమెసేసిన యపరాధమేమో నీకుఁ దెలియునా?

రేవ - ఏమియునులేదు. వెఱ్ఱియనుమానము. ఆమెపురాకృతము.

చారా - ఆమెను జంపించినపిమ్మట నమ్మనుజపతిహృదయ మెట్లున్నది?

రేవ - చచ్చినతరువాత ననురాగము పెరుఁగునుకాదా ? ఆయన యేభార్యయొద్దకుం బోక లీలావతియంతఃపురమందే యెప్పు డామెనుగూర్చి దుఃఖింపుచున్నాఁడని తెలిసినది.