పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

315

నతనిమొగము చిన్నబోయియున్నట్లే మేము గనిపెట్టితిమి. నీవిషయమై పశ్చాత్తాపము చెందియున్న వాఁడు. నీకు తప్పక భర్తృసమావేశము గలుగఁగలదు. అని పలుకుటయు నామె యుల్లమురంజిల్ల నార్యా ! నా కట్టిభాగ్యము పట్టునా? నే నంతపుణ్యాత్మురాలనా? యనుచు సంతోషమును సూచించినది.

అప్పుడు చారాయణుండు తల్లీ ! నగరిలో నీకు నమ్మకమైనవా రెవరైన నుండిరా? వారిం బేర్కొనుము. వారితో మైత్రిచేసి తన్ముఖముగా రాజుగారి హృదయాశయము దెలిసికొందము. అనుటయు రాజపత్ని సాపత్నిపుత్రికయగు రుక్మిణి తనకు హృదయస్థానమనియుఁ దన్ను గుఱించి యాచంచలాక్షియే చింతించుచుండుననియుఁ దనరాక నాకోకస్తని కెఱింగింపవచ్చుననియుం జెప్పినది. మఱియు నారుక్మిణి కాంత రంగికసఖురాలు రేవతియను యువతికడకుఁబోయి మాట్లాడిన నగరిలోని విశేషము లెఱుంగవచ్చును. అనిచెప్పిన విని చారాయణుండు సంతసించుచు గుఱుతులడిగి యాయింటికిం బోయి దానితో నిట్లుసంభాషించెను.

చారా - రేవతీ ! నీతో నా కొకపనిగలిగి వెదకికొనుచు వచ్చితిని. నిన్నుఁ జూచినతోడనే నాకార్య మీడేఱునని తోఁచుచున్నది.

రేవ - అయ్యా ! తమరెవ్వరు ? ఏయూరు? నావలనఁ దమకుఁ గావలసినపని యేమియున్నది?

చారా — నేనొక బ్రాహ్మణుఁడ. పండితుఁడ. కాశీనివాసుఁడ. ఈయూర విద్వత్సభలు జరగునని విని ప్రసంగింప వచ్చితిని. నీవలనఁ గావలసినపని మఱేమియును లేదు. ని న్నొకమాట యడుగఁ దలంచితిమి.

రేవ - (లేచి నమస్కరించుచు) పండితోత్తమా! కించిజ్ఞురాలనగు నన్నడుగవలసినమాట యేమున్నది ? అవశ్యము తెలిసినది వక్కాణించి కృతకృత్యురాల నగుదును.

ఆహా ! నీసుగుణంబులు నేవినినవానికన్న మిన్నగానున్నవి. బ్రా