పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

313

అని పలుకుచు నప్పటికిఁ గరతాళములతో సెబాసు ! భళా ! యనుమాటలు బయలుదేరినవి. ప్రజాభిప్రాయము ననుసరించి భోజభూపతి తిరుగా ప్రజాపాలనమున కంగీకరించెను. అప్పటికిఁ గాలాతీత మగుటయు నంతటితో సభముగించుచుఁ బ్రతిదినము నొక్కొక్కవినోదము ప్రదర్శించునట్లు నిశ్చయించి తమతమ నెలవులకుఁ బోయిరి.

అని యెఱింగించువఱకు వేళమిగిలినది. అవ్వలికథఁ బైమజిలీయం దిట్లు చెప్పమొదలుపెట్టెను.

166 వ మజిలీ.

సువర్ణ నాభుండును జూరాయణుఁడును మల్లిక సువర్ణ పదిక రత్న పదిక లీలావతి మొదలగుసఖులతో ధారానగరంబున కరుదెంచి యొకచో వసించియుండిరి. పురుషులుమాత్రము సభకుఁబోయి విశేషములు చూచి యింటికివచ్చినతోడనే మల్లికయు సువర్ణ పదికయు వారిం జేరుకొని లీలావతీరత్న పదికలు దూరదూరముగానుండి విచారముఖంబులతోఁ జూచుచుండ నార్యులారా ! సభ యెట్లుజరిగినది? కాళిదాసుం గౌరవించిరా? భైరవునివార్తదెలిసినదా? వానివృత్తాంతము దెలిసికొనివచ్చితిరా? అని యడిగినఁ జారాయణుం డిట్లనియె.

భోజుండు మిగుల తేజశ్శాలి. శౌర్యవంతుఁడు, మంచివక్త. ఆహా! రూప మాసేచనకమైయున్నది. నదాన్యత యనన్యసామాన్యమే ! కాళిదాసకవినిఁ దనసింహాసనముపైఁ గూర్చుండఁబెట్టి పట్టభద్రుం గావించి రాజ్య మిచ్చివేసెను. అతం డంగీకరింపక తిరుగా నిచ్చి నీవే పాలింపవలయు నేనర్హుండఁగానని యుపన్యసించెను. దాతృప్రతిగృహీతల యౌదార్యమును సభ్యులు స్తుతియించిరి. గోణికాపుత్రుఁడు రాజపుత్రునకు మిత్రుఁడై యందుఁ బెద్దయై తిరుగుచున్నాఁడు. గోనర్దీయుఁడు కుచుమారుఁడు ప్రభువేషములతోవచ్చి సభ నలంకరించిరి. అప్పుడు మే మొకరి నొకరు పల్కరించికొనుట కవకాశము లేకపోయినది. దినమున కొక