పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

జయధ్వానములతో ననర్ఘ రత్నసింహాసనమునఁ గాళిదాసుం గూర్చుండఁబెట్టి భోజుండు పుత్రుఁ డొకవంకఁ దా నొకచక్కి నిలువంబడి వింజామరలు విసరుచుండి రట్టియెడ,

సీ. విరివాన గురిపించి రురుభక్తి సభ్యులు
                  మొరసెఁ దూర్యధ్వనుల్ ధరఁ జెలింపఁ
    గవిశిఖామణులు శ్లోకములు పెక్కు రచించి
                  వినుతించి రురుకళావిభవ మమర
    గాంధర్వవిద్యాప్రగల్భంబు గాన్పింప
                 గాయకుల్ బాడిరి హాయి మీఱ
    వారాంగనాతాండవములు గన్నులపండు
                 వుగ నొప్పె నభినయస్ఫురణ వెలయ

గీ. హారతుల నిచ్చి రెలమిఁ బుణ్యాబ్జముఖులు
    వందిబృందమ్ము జేసెఁ గైవారములను
    గాళిదాసకవీంద్ర శేఖరుఁడు సభ న
    నూనసింహాసనాసీనుఁ డైనయపుడు.

అప్పుడు భోజుండు సభ్యులదిక్కు మొగంబై యార్యులారా ! నాదేశంబంతయు నీదేశికోత్తమున కిచ్చివేసితిని. ఇదిమొద లితండే దేశాధిపతి. ఇంతటినుండియు నితనియాదేశమునఁ బ్రజలు వర్తిల్లుదురుగాక యని ప్రకటించిన విని సభ్యులెల్లరు నోహో హో ! యని యానృపతి వితరణమును వినుతించిరి. అప్పుడు కాళిదాసు లేచి నిలువంబడి,

శ్లో॥ నాహం భూధూర్వహోరాజన్ నాహం సత్పాలనెక్షమః
     క్షత్రియస్త్వం సమర్ధస్త్వం స్వీకురుష్వవునర్భువం!

కం. ఏ నీధాత్రీభారము
     బూని ప్రజలఁ బ్రోవఁజాల భూవర ! నీకే
    దీనిం గ్రమ్మఱ నిచ్చితిఁ
    గానఁ దదీయోరుభరము గైకొను మనఘా !