పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

309

రాజపుత్రా ! సోదరీగర్భకారణుఁ డెవ్వఁడో తెలిసికొని వానికే యామానవతినిచ్చి వివాహము గావింపవలయు. రుక్మిణి సామాన్యుని వరింపదు. రాజకన్యలకు గాంధర్వవిహహం బుత్తమముకాదే? మఱియు మీతండ్రిగారివార్త మఱలఁ దెలిసినదా? మొన్నటిజాబులోఁ జాలదాపునకు వచ్చితిమని వ్రాసిరే. కాళిదాసమహాకవి నందలముపై నెక్కించి తాను పల్లకీతో నడిచివచ్చుచున్నారఁట కాదా? తరువాతివార్త లేమని యడిగిన రాజపుత్రుఁ డిట్లనియె.

మొన్నటివార్తకన్నఁ గ్రొత్తవార్త లేమియుఁ దెలియవు. నేఁడో రేపో రాఁగలరు. వత్తురనిన నాకు గుండెలు కొట్టుకొనుచున్నవి. అని మాటాడుకొనుచున్నసమయంబునఁ బ్రధానామాత్యుఁ డరుదెంచి రాజపుత్రు నాశీర్వదింపుచు భర్తృదారకా ! మహారాజుగారు రేపుసూర్యోదయమునకు వత్తుమని యిప్పుడే వార్తనంపిరి. వెనుక వారువ్రాసినప్రకారము పట్టణమంతయు నలంకరింపఁజేసితిమి. నానాదేశ భూపతులకు నాహ్వానపత్రికల నంపితిమి. పండితులు కవీంద్రులు వేనవేలు వచ్చియుండిరి, వచ్చుచున్నారు.

భైరవుండను మృగవినోదకారుని వారే రప్పింపుమని వ్రాసియున్నారు. వాఁడును వచ్చి తోటలో విడిసియున్నాఁడు. నాటకులు పాటకులు లక్షోపలక్షలు వచ్చుచున్నారు. వెనుక సంగీతముపాడిన చేడియ సపరివారముగా వచ్చినది. మహాసభాదివసంబున నూరకయే సంగీతముపాడి యాకాళిదాసకవి యాశీర్వచనమునకుఁ బాత్రురాల నగుదునని తెలియఁజేసినది. మఱియు గోనర్దీయుఁడు కుచుమారుఁడు లోనగు విద్వత్ప్రభువులు వచ్చియున్నారు. వారందఱకుఁ దగిననెలవు లేర్పఱచితిమి. పట్టణమంతయుఁ గ్రొత్తవారిచే నిడింపఁబడియున్నది. రేపుప్రొద్దున్న మేళతాళములతో వారికి మస మెదురేఁగవలయును. మీరుగూడ రావలయునని నివేదించిన సంతోషించుచు రాజపుత్రుఁ