పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మాట కందఱు నేకగ్రీవముగా నంగీకరించిరి. మంచిముహూర్తమున బయలుదేరి యందఱును కొన్నినాళ్ళకు ధారానగరంబు చేరిరి.

అనియెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. తదనంతరోదంతం బవ్వలిమజిలీయందుఁ జెప్పదొడంగెను.

165 వ మజిలీ.

భోజరాజపుత్రుండు చిత్రసేనుఁ డొకనాఁడు గోణికాపుత్రునితో నేకాంతప్రదేశమునఁ గూర్చుండి యిట్లు సంభాషించెను. మిత్రమా! పూర్వజన్మకర్మఫలంబులు కడువిచిత్రములు సుమా! సుఖమిళితమైన దుఃఖము! దుఃఖమిళితమైనసుఖము గలుగుచుండును కాని కేవల మేదియోయొకటి దిరముగానుండదు. చారుమతిసంయోగంబు సంతోషదాయకంబు. దాన నానందింపుచుండ నిపు డొకదుర్వార్త వినంబడినది. అది పరమరహస్యమైనను నీ వాప్తుండవుగావునఁ జెప్పుచుంటి వినుము. నాచెల్లెలు రుక్మిణిచరిత్రము శంకాస్పదమై యున్నది. అది గర్భవతియై నట్లు తెలియవచ్చినది. వెనుక దానిగుఱ్ఱమెక్కి యొకపురుషుఁ డుద్యానవనములోనికివచ్చెను. ఆపరీక్షకై నేనుబోయినఁ జారుమతిం జూపుచు నిదియే వచ్చినదని బొంకినది. స్త్రీలెఱింగినమాయలు బృహస్పతికిని శుక్రాచార్యునికిఁగూడఁ దెలియవని శాస్త్రములు చెప్పుచున్న యవి. మా తండ్రి దాపునలేకపోవుటచేత నీభారము నామీఁదఁ బడినది. చారుమతి మోహములోఁబడి నే నొండు విచారించితిని కాను. ఇప్పు డేమిచేయఁదగినది ? యుపాయ మేమి ? ఈయల్లరులువినినఁ దండ్రిగారు చాల కోపింతురు. వయస్యా ! కర్తవ్య మెఱుగింపుమని యడిగిన గోణికాపుత్రుం డిట్లనియె.