పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

307

తప్పినది. అని వానింబట్టికొనుటకు రహస్యముగా బెక్కండ్రగూఢచారుల నియోగించి పట్టియిచ్చినవానికి గొప్పపారితోషికమిత్తునని దెలియఁ జేసెను.

ఆరహస్యము యక్షుం డెఱుఁగడు. తిరోహితుండుగాక మెల్లఁగా మృగములతో నడుచుచున్న సమయంబున వానివెంట నడుచుచుండెను. గూఢచారుం డొకఁ డతనిఁబట్టికొని భైరవుని కర్పించి వీఁడే మేషచోరుఁడు వెంటవెంటఁ దిఱుగుచున్నాడని తెలియఁజేసెను. అప్పుడు భైరవుఁడు కోపముతోఁ దొత్తుకొడుకా ! మృగముల నెత్తికొనిపోవుచున్నావా ? నీపని యిఁకఁ జూచుకొమ్ము అనిపలుకుచు గట్టిగఁబట్టికొని నెత్తిపై మందురుద్ది తాయెత్తుగట్టి పెద్దగాడిదం గావించెను.

యక్షుం డైననేమి? యింద్రుం డైననేమి? ప్రారధ్ధ మనుభవింపవలసినదేకదా! భైరవుం డట్లు పెక్కండ్ర మృగములఁజేసి తనకుఁ బెద్ద కానుక దొరకునని యాసతో నామృగసమూహముతోఁగూడ ధారానగరమున కరిగెను.

యక్షుం డా నాఁడును రాలేదు. మఱునాఁడును రాలేదు. మూఁడవనాఁడును రాలేదు. యక్షపత్ని మిక్కిలి దుఃఖించుచు సువర్ణ నాభునితో నార్యా! నాభర్త యెంతపనియున్నను వరుసగా రెండురాత్రుల కన్న నెందును నిలువరు ? ఏదోయాటంకము గలిగినది. ఆపాపాతుఁడు వారింబట్టుకొని బంధించెనుకాఁబోలు. అయ్యో ! దైవమా! నే నేమిచేయుదును. మహాత్మా! యుపాయ మాలోచింపవా? అని శోకించుచుఁ బలికిన. నూఱడింపుచు సువర్ణనాభుఁ డిట్లనియె.

తల్లీ! నీవువిచారింపకుము. యక్షుం డెందున్నను వెదకి తీసికొని రాఁగలము. మఱియు వాఁడు మృగములతోఁగూడ సభాదివసంబునకు ధారానగరంబున కరుగునని నీభర్త చెప్పియున్నాఁడు. మనమందఱము నాఁటి కందుఁ బోవుదము. అన్ని కార్యములు దీరఁగలవని చెప్పెను. ఆ