పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

క్షణముదాటిన శాకఘటంబునం జేరువాఁడనే. యక్షుండు రక్షించె. నీకును నాకునుగూడ నాయనయే తండ్రి. దుఃఖింపకుము. మాతలిదండ్రులఁగూడ దీసికొనిరాఁగలండని యోదార్చుచు యక్షకాంతల బంధుత్వము దెలిసికొని లీలావతివృత్తాంత మాకర్ణించి పరమానందభరితుండై యాభైరవునికథ యంతయుం జెప్పి వాని సంహరించుటకుఁ దోడు రమ్మని యక్షుం బ్రార్థించెను.

యక్షుండు చారాయణునిమాట విని బాబూ ! వాఁడు మంత్ర తంత్రముల నెఱింగినవాఁడు. వానిచేతఁజిక్కెనేని నాపనికూడ పట్టఁగలఁడు. వానిని బరిభవించుతెఱఁగు మఱియొకటి గలదు వినుము. వాఁడు పదిదినములలో ధారానగర మరుగఁగలఁడు. కాళిదాసుం గౌరవించునిమిత్తమై పెద్దసభ జరగునఁట. ఆసభకు వీఁడు పోవుచున్నాఁడు మనముగూడ నాఁటి కవ్వీటికిఁబోయి వీనిదుర్నయమంతయు నారాజున కెఱింగించి యానృపతిచే వాని శిక్షింపఁజేయుద మిదియే నాకుఁ దోఁచినయూహ. మీరుగూడ నాలోచింపుఁడని పలికెను. అందఱు నందుల కొప్పుకొని ధారానగరమ్మునకుఁ బోవ ముహూర్తము నిశ్చయించుకొనిరి.

ఈలోపల నాభైరవుం డెందున్నాఁడో? యావీటి కరుగుచున్నాఁడో లేదో చూచివచ్చెద ననిపలికి యమ్మఱునాఁడు యక్షుండు మఱల నాతఁడున్న యడవికింబోయెను వాని పరివారమంతయు ధారానగరంబునకుఁ బోవుచుండెను. నడుమనడుమ నివసించుచుండిరి.

మేకనమ్మి రత్నకంకణముసంపాదించి మఱియొకమేకమాంసము పెట్టెనని వేఱొకపరిచారకుఁడు భైరవునితోఁ జెప్పి యాతప్పు పట్టియప్పగించెను. భైరవుఁడు క్రోధభైరవుండై బానిసవానిని శిక్షించి అక్కటా! ఎవ్వఁడో నామృగములరహస్యము దెలిసికొని వెనువెంటఁ దిరిగి మృగములఁ బక్షులం దీసికొనిపోవుచున్నాఁడు. తెలిసికొనలేకపోయితిని. అక్కటా! ఆబ్రాహ్మణబ్రువునిమాంసము దిని కసిదీర్చి కొంటిననుకొంటి.