పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

305

లోనియోషధి లాగిపారవైచిరి. ఆమేష మొక్క చక్కనిపురుషుండై నిలువంబడి నలుమూలలు సూచి హా పాపాత్మా ! ఎంతపనిజేసితివిరా? చీ, చీ, నీ వేనరకమునకుఁ బోవుదువో గురుద్రోహీ ! దయాసింధువగు నిమ్మహాత్ముశిరంబు పగుల నెట్లు పాషాణమువైచితివిరా? కృతఘ్నా ! కనంబడవేమి ? యెందుఁబోయితివి? అయ్యో ! నాగురువు నాదైవము బలవన్మరణమునొందె నతనికళేబర మేమి సేసితివిరా ? అని యూరక దుఃఖించుచుండెను. సునర్ణనాభుండు విమర్శించిచూచి యోహో ! వీఁడు నామిత్రుఁడు చారాయణుఁడు. వానిచేతిలోఁ బడెనా? అయ్యో! పాపము మల్లిక వీఁడు ధారానగరమున కరిగెనని చెప్పినది. ఈయంతరాయ మెఱుఁగదు. చారాయణా! నాదెస జూడుము. నే నెవ్వఁడనో యెఱుఁగుదువా? ఎవ్వనినో నిందించుచుంటివి ! వాఁడెవ్వఁడు ? నేను నీమిత్రుఁడ సువర్ణనాభుఁడనని పలికినతోడనే యతండు కన్ను లెత్తిచూచి యౌరా! ఏమిచిత్రము! నీ వెక్కడినుండి వచ్చితివి? తక్కినమిత్రు లిందుండిరా? అని పలుకుచు సువర్ణనాభుని గౌఁగిలించుకొని హృదయంబునఁగల ప్రీతిని వెల్లడించెను.

పిమ్మట సువర్ణనాభుండు మిత్రమా! నీవృత్తాంతము కొంత మేము నీభార్యవలన వింటిమి. ఆవాల్గంటి యిందున్నది. మీయిద్దఱు నొక్కనిచేతిలోనే చిక్కి యొక్క చోటనే యుంటిరి. అని యక్షునివలన రక్షింపఁబడినవిధ మెఱింగించెను. తనభార్యవృత్తాంతము విని చారాయణుం డామెంజూచుటకు మిక్కిలి తొందరపడియెను. ఇంతలో నావార్తవిని మల్లిక గుహాముఖంబునకువచ్చి భర్తంజూచి సిగ్గుచే దాపునకుఁ బోలేక కన్నీరుగార్చుచు దుఃఖించినది.

చారాయణుండు తటాలున నారమణిం గౌఁగిలించుకొని యక్కునంజేర్చికొని కన్నీరుదుడుచుచు సాధ్వీ ! నీతెఱంగు వింటిని. నన్ను వాఁడు గాడిదంజేసి బరువు మోయించుచుండెను. చంపుటకై మేకంజేసెను.