పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

303

యీవేళ నీ కీకీరమును దెచ్చితిని. దీనింగూడ స్త్రీని గావింతునా ? యని పరిహాస మాడుటయు సువర్ణ పదిక యాచిలుకనందికొని ముద్దాడుచుఁ గీరమా! నీవుగూడ మయూరమువలె మనుష్యకాంతవు కావుగద ! అవును. సందియమేలా? ఇదిగో మెడకుఁ దాయెత్తు గట్టఁబడియున్నది. అనిపలుకుచు నాతాయెత్తు లాగిపారవైచినది.

దివ్యమంగళవిగ్రహము సర్వావయసుందరము గలిగి యక్షకాంతల సిగ్గుపఱచుచు నొకసుందరి వారిముందర నిలువంబడినది. పదునాలుగేఁడులప్రాయము చక్కనిమొగము సంపూర్ణ లావణ్యము గలిగి మెఱయుచున్న యాబాలికారత్నమును జూచి వెఱఁగుపాటుతో లీలావతి పుత్రీ ! నావలె నీవుగూడ నాకపటాత్మునిచేతిలోఁ బడితివా? అయ్యో! చిన్నదానవు. తలిదండ్రులచాటుదానవు. నీపేరేమి? ఎవ్వనిభార్యవు ? నీవృత్తాంతము చెప్పుము. వీనిచే నెట్లుచిక్కితివి? అనియడిగిన నాచిన్నది తెలతెల్లపోయి చూచుచు నిట్లనియె.

దేవీ ! ఇప్పుడు నామది భ్రమజెందుచున్నది. ఇది స్వప్నమా ? నిజమా ? ఇది యేదేశము ? నే నిక్కడి కెట్లువచ్చితీని ? మాతలిదండ్రు లేరీ? అడవిలోఁ గ్రూరాత్ముఁ డెవ్వఁడో మమ్ము వెఱిపించెనే. అమ్మా! నాపేరు మల్లిక. బ్రహ్మదత్తుండను విప్రునికూతురను. చారాయణుఁడను పండితునిభార్యను. నాభర్త నన్ను వివాహమాడి తనమిత్రుల దత్తకాదులంజూడ ధారానగరంబున కరిగి వెండియు రాఁడయ్యె నాయననిమిత్తమై నాతలిదండ్రులు నన్ను వెంటఁబెట్టుకొని ధారానగరంబున కరుగుచుండ దారిలో నొకక్రూరుఁడు మా కడ్డమై యదలించెను. అంతవఱకు జ్ఞాపకమున్నది. తరువాత నేమిచేసెనో యేమైతిమో తెలియదని తనకథ యంతయుం జెప్పినది.

సువర్ణ నాభుం డావార్తవిని యేమేమీ ! నీవు చారాయణుని భార్యవా ? ఆతండు నామిత్రుఁడు. అన్నన్నా ! యెట్టియాపదంజెందితివి?