పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వానింజూచి నీవు సిగ్గున లోపలికిఁ బోయితివి జ్ఞాపకములేదా ? తరువాత వాని నాఁడుదానిగా శపించితిమి. ప్రార్ధింప సంవత్సరమే యాఁడుతన ముండునట్లు కరుణించితిని. ఆతండే వీరి కీవార్త చెప్పియుండును. అనిపలుకుచు సువర్ణనాభునితో నార్యా! మీతో మాయున్నయిక్క యెఱింగించినవాఁడు ఏమయ్యెను ? ఆఁడుది కాలేదా ? అనియడిగిన సతండు హాహా కారము గావింపుచు నిట్లనియె.

అయ్యో ! నామిత్రుఁడు సంతోషాతిశయంబున శాపప్రవృత్తి మఱచి మీ తెఱం గెఱింగించె నది మన కుపకారమైనది. అతండు స్త్రీయై పోయినది యెఱుంగక పెద్దతడవు వెదకితిని. ఎందునుం గనంబడలేదు. ఆహా! దైవనియోగము. అఖండపాండిత్యధురంధరుండగు నామిత్రుఁడు దత్తుం డిప్పుడు మత్తకాశినియై పూర్వస్మృతిలేక చరించుచున్నాఁడా ? కట్టా ! ఆయిక్కట్లు వాని కెట్లుపాయును. మహాత్మా! అతనిమూలముననేకదా మనమందఱము గలిసికొంటిమి. నన్నుఁబట్టి యాతండును మీ కాప్తుండయ్యెను. తచ్ఛాపవిముక్తిఁ గావింపవలయునని వేఁడుకొనియెను.

రత్నపదిక యాతఁడా ? అయ్యో ! పాపము స్త్రీయైపోయెనా ? అట్టిహితుండు మఱియొకఁడు మనకు లేఁడు. వానిం గాపాడకతీరదు. వేగమ శాపనివృత్తిఁ గావింపుఁడని నిర్బంధించినది. సువర్ణ పదికయు నా మాటయే బలపఱచినది. అట్లుచేయుట కతం డంగీకరించెను. ఆ రేయి సుఖముగా వెళ్లించిరి.

మఱునాఁడు యక్షుండు వాడుకప్రకారము బయలుదేరి యా తంత్రజ్ఞుఁడుచేయు కపటంబులం దెలిసికొనుటకై యాతఁడున్న యరణ్యమునకుం బోయి ప్రచ్ఛన్నముగా మృగములను బక్షులను బరామర్శింపుచుఁ గావలివారలు సూడకుండ నొకచిలుక నెట్లో పట్టికొని చేతిపై కెక్కించుకొని నాఁడు పెందలకడ నింటికివచ్చి సువర్ణ పదికం జీరీ బాలా !