పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

301

సువర్ణ నాభుం డావార్త విని అమ్మా ! నీకు సహాయముచేసినవాఁడు ఘోటకముఖుండంటివి. అతఁడు నామిత్రుఁడు. తరువాత నతం డేమయ్యెనో యెఱుంగుదువా? యని యడిగిన నామె నా కేమియుం దెలియదు. కుక్కలు తఱుముకొనిపోయి కఱచినవి. నేలంబడిపోయె. పిమ్మట నేనొడలుతెలియక నెమలినై పోవుటచేఁ బూర్వస్మృతి తప్పినదని చెప్పి మీరెవ్వరు? కాళిదాసు నెఱిఁగినట్లు మాట్లాడుచున్నారు. వారితో మీకుఁ బరిచయ మెక్కడకలిగినది ? మీవృత్తాంతము చెప్పి యానందింపఁ జేయుఁడని వేడిన సువర్ణ పదిక తమవృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆకథ విని లీలావతి వారిరువురం గౌఁగిలించుకొని పడఁతులారా ! మీరు దేవతలు. మీదర్శనముచేసి మనుష్యులు కృతార్థులగుదురు. నేను ధన్యురాలనని పొగడుచు భోజునివృత్తాంతము మీ కేమైనఁ దెలిసినదియా? యని యడిగిన యక్షుండు రేపు వోయి తెలిసికొనివచ్చెద నీవు విచారింపవలదని యాదరించెను.

రత్నపదిక యారాజభార్యను గుహాంతరమునకుఁ దీసికొనిపోయి యందలివింతలన్నియుం జూపెను. మనుష్యలోకములో నట్టియలంకారము లుండవు కావున వానింజూచిన విభ్రమము గలుగకమానదు. వా రా రాత్రి విందు లారగించి గుహాప్రాంగణమందున్న స్ఫటికశిలావేదికపైఁ గూర్చుండి యిష్టాలాపము లాడికొనుచున్న సమయంబున రత్నపదిక భర్త కిట్లనియె.

మనోహరా ! ఇక్కందరమందిరము మనుష్యులు తెలిసికొనఁ జాలరనియు నేకాంతప్రదేశమనియుం జెప్పితిరే? ధారానగరంబున వీరి మిత్రుఁ డెవ్వఁడో చెప్పెనఁట ! వాని కెట్లు తెలిసినది ? మీరు నాతో నన్నమాట యసత్యమా? అనియడిగిన యక్షుండు తరుణీ! మఱచితివా? నాఁ డొకబ్రాహ్మణుఁడు దారితప్పి రాత్రివేళ మనయింటికి రాలేదా?