పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గా నిచ్చెదఁ గైకొనియెదవా? యని యడిగిన సంతసించుచు సువర్ణ పదిక దానిం దీసికొనివచ్చి విమర్శించుచు నీలకంఠమా ! నీ వభిఖ్యచే శంకరుం బోలితివి. బర్హ మువిప్పి తాండవముసేయుము. అని పలుకుచు నాహా ! భగవంతుఁడను చిత్రకారుఁడు దీని కెన్నిరంగులువై చెనో! అని వింతగాఁ జూచుచు నది బెదరకున్న మెడ దువ్వి దువ్వి మెడకుఁ గట్టఁబడియున్న తాయెత్తును సడలించినది.

అప్పు డామయూర మొకసుందరియై నిలువంబడినది. అయ్యువతీవతంసమును జూచి రత్నపదికయు సువర్ణ పదికయు వెఱఁగుపడుచు సమీపించి యిట్లనిరి. తల్లీ! నీ వెవ్వనియిల్లాలవు? నీపేరేమి? ఇట్టినిగూఢపురూపు ధరించియుంటివేల ? నీయుదంత మెఱింగింపుమని యడిగిన నాప్రోయాలు నలుమూలలు సూచుచు విభ్రాంతితోఁ గాంతలారా ! మీరెవ్వరో నే నెఱుంగ నకారణవాత్సల్యముతో నన్ను బ్రతికించితిరి. మీకడ నిజము దాచరాదు. వినుండు. నేను ధారానగరాధీశ్వరుండైన భోజమహారాజు భార్యను. నాపేరు లీలావతి యందురు. నే నభాగ్యవశంబున భర్తకెడమై యడవిలోఁ గ్రుమ్మరుచు ఘోటకముఖుండను విద్వాంసునియాశ్రయమున నరుగుచుండ నొకతంత్రజ్ఞుని మాయామహిమచే మయూరమునై తినని తనకథయంతయు నెఱింగించెను.

ఆవృత్తాంతము విని యక్షుండు గుండెపైఁ జేయివైచుకొని అబ్బా ! రండాపుత్ర! నీవెట్టిక్రూరుఁడవురా? నీకడనున్న మృగములన్ని యు నిట్టివెకాఁబోలు ! నిన్ను వెదకి పట్టికొని శిక్షింతును చూడుము.

తల్లీ ! లీలావతి ! మహానుభావుండైన కాళిదాసుం బాలించుచున్న భోజభూభుజుని యిల్లాలవా ? అయ్యా రే! మే మెంత ధన్యులము. నీపాదధూళిసోకి మాయిల్లు పవిత్రమైనది. అమ్మా! నీకు వచ్చినభయము లేదు. నిన్నుఁ బ్రాణపదముగాఁ జూచుచుఁ దీసికొనిపోయి నిన్ను నీభర్తతోఁ గూర్తుము అని యూఱడించెను.