పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కస్సుకథ.

293

నిలు నిలు, నీపీచ మడంచెద; లీలావతి నెందుదాచితివో చెప్పుమని యదలించుచు నడ్డముగా నిలువంబడితిని ఘోటకముఖుండు నడుముగట్టుకొని నాతో నిలువంబడి వాని మందలింపు చుండెను. దండధరుండనై యున్న నన్నుఁజూచి మృగములు పారిపోవఁజూచెను. అంతలో వానిపరిజనులు మూఁగికొని మాతోఁ గలియఁబడుటకు నాయత్తపడిరి. చేత నాయుధము లేకున్నను వెఱవక మేమిరువురము వెనుకకు మఱలక చేతనున్న కఱ్ఱలతో వారి నాపితిమి.

ఆతాంత్రికుఁ డెఱ్ఱనిగుడ్లతో నన్నుఁజూచుచు నేదియో పసరు నామీఁదఁ జల్లి నాకు స్మృతిలేకుండఁ జేసెను. అంతవట్టు జ్ఞాపకమున్నది. తరువాత నేమిజరిగినదియో నాకుఁదెలియదు. నామిత్రుఁడు నాపాటుజూచి చేయునదిలేక పారిపోయియుండును. ఇదియే నావృత్తాంతమని చెప్పిన విని కాళిదాసు కన్నీరుగ్రమ్మ వాఁడు గొఱ్ఱెగాఁజేసి యచ్చటికిఁ దీసికొనివచ్చి యాడించినవిధము మొదలగు వృత్తాంతమంతయు నెఱిఁగించెను.

అప్పుడల్లాణుం డుల్లమున సంతోషవిస్మయములు వెల్లివిరియ భోజునిఁ గౌఁగిలించుకొని మహానుభావా ! కవిజనానీతంబులగు భవదీయయశోవిసరంబులు సంతతము మదీయకర్ణ పర్వములు గావింపుచునే యుండెను. కాని దర్శనలాభంబెన్నండును గలుగలేదు. తాంత్రికుం డీ రూపమున నాకు మహోపకార మొనరించెను. మీదర్శనము సేసి నేను గృతార్థుండ నైతిని. కింకరుండఁ బనులకు నియోగింపుము. పట్టభద్రుండవై యీకవిసార్వభౌమునితోఁగూడ నీరాజ్యము పాలింపుమని యత్యంతవినయముతోఁ బ్రార్థించిన భోజుం డిట్లనియె. .

వదాన్యోత్తమా! ఇట్లనుటకు నీకకాక యొరులకు శక్యమా? ఇట్టి వాఁడవగుటచే యీమహాకవి మీకడఁ జేరెను. మిమ్ము రాజ్యముకన్న నధికమైనవస్తు వొండు యాచించుచున్నాను. అది నాకు దయచేయుఁడు.