పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పరమానందభరితుండ నగుదునని యడిగిన నతండు చిఱునగవుతో నీరాజ్యమే మీయధీనమనిన నన్నొండు యాచింపవలసిన వస్తువేమున్నది ? అనుటయు భోజుండు దేవా ! మఱేమియునులేదు. ఈమహాకవిచంద్రుఁడు నాకుఁ బ్రాణము. ఈతని నాకు దయచేయఁ బ్రార్థించుచున్నాను. మీకుఁ బ్రాణదానఫలంబు రాఁగలదని పలికిన నవ్వుచు నళ్లాణుండు,

ఓహో ! ఇదియా మియాశయము. ఇందులకు నాసెలవేమిటికి? మీకు నేను బ్రేష్యుండఁగానే ? మీయభీష్ట మెట్లో యట్లే కావించెద నని వినయవినమితోత్తమాంగుడై పలికెను.

తరువాత భోజుం డంజలిపట్టుకొని కాళిదాసకవితో,

శ్లో॥ గచ్చత స్త్సిష్టతో వాపి జాగ్రతస్స్వప్నతోపివా
     మాభూన్మనఃకదాచిన్మె త్వయావిరహితంక వే॥

ఆర్యా ! నడుచుచున్నప్పుడును గూర్చున్నప్పుడును మేల్కొనునప్పుడును నిద్రబోవునప్పుడును నామనస్సు నీవియోగమును సహింపదు. నాతప్పులన్నియు మన్నించి ధారానగరంబునకు రావలయు. నీవు లేనినగరంబు నేను సొరనొల్లనని వేఁడుకొనియెను. అతండును బ్రేమానుబంధ బంధురములగు నృపతిమాటల కంగీకరించెను.

అల్లాణుండు భోజునకు గొప్పవిందు గావించెను. భోజుండు శుభముహూర్తమునఁ గాళిదాసు నొకపల్లకిపై నెక్కించి తాను పాదచారియై దండిపట్టుకొని నడుచుచు నాపురంబు బయలువెడలెను.

అని యెఱింగించి పిమ్మట నిట్లు చెప్పుచుండె.


___________