పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మెలంగుచుంటివి బాబూ ! అని దానిపైఁబడి యూరక దుఃఖించు చుండెను.

మఱియు మెడం దడుముచు మోము మూర్కొనుచుఁ జెవుల దువ్వుచు మెడ గోకుచు నిమిరినిమిరి దానిమెడలోఁగట్టిన తాయెత్తు నంటి చూచి లాగి పారవై చెను. అప్పు డామేష మదృశ్యమై భోజుండై నిలు నిలు మూర్ఖా! యెందుఁబోయెదవు.? నీపీచ మడంచెదఁ జూడుమని పలుకుచు నలుమూలలు సూచి యెదుటఁ గాళిదాసకవిం గాంచి పులకాంచితశరీరుడై ఓహోహో ! యీతఁడు నాపాణమిత్రుఁడు కాళిదాసకవియే ! ఆహా ! నేఁ డెంతభాగ్యము ? నే నిక్కడి కెట్లువచ్చితిని ? ఘోటకముఖుఁ డేడీ ! మహాత్మా! రక్షింపుము. నాయపరాధము సైరింపుము. అని యాతనిపాదంబులఁ బడియెను.

అప్పుడు కాళిదాసకవి యతని లేవనెత్తి కౌఁగిలించుకొనుచు నరేంద్రా ! అని కన్నీరుగార్చుచు డగ్గుత్తికతో,

శ్లో॥ స్నేహెూహి వర మఘటితో నవరం సంజాత విఘటితస్నేహః।
     హృతనయనోహి విషాదీ నవిషాదీభవతి జాత్యంధః॥

స్నేహముకలిసి విడుచుటకంటెఁ గలియకుండుటయే శ్రేష్ఠము! నడుమఁ గన్నులుపోయినవాఁడు చాలవిచారించును. జాత్యంథున కేచింతయు నుండదు. మహారాజా! నీ వీతాంత్రికునిచేతిలోఁ జిక్కితివేమి ? నీవృత్తాంత మెఱింగింపుమని యడిగిన భోజుండునాకిది దిగ్భ్రమగానున్నది. ఇది యేదేశము? ఇది యేకశిలానగరముకాదా? అల్లాణభూపతియేకాఁడా దీనిం బాలించువాఁడు? మహాత్మా! నీ విందుంటివని విని పురందరపురము నుండి వచ్చుచుండ దారిలో మృగసమూహంబు సేవింప నెందేనింబోవుచున్న భైరవుండను తాంత్రికుండు మాకుఁ గనంబడియెను. వాఁడు స్త్రీలఁ జెఱవెట్టుచున్నాడని విని వాని శిక్షింపందలంచి తిరుగుచుంటిమి కావున వాఁడు గనంబడినతోడనే కోప మాగినదికాదు. పాపాత్మా !