పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుని కథ.

19

ఇప్పుడు నన్నందుఁజూచి మందలించుచున్నది. వేశ్యాలంపటుఁడగు నాకవి నంతఃపురమునకుఁ దీసికొనివచ్చి చనువుజేయుట నాదేతప్పు. వనితయు లతయు దాపుననున్న వానిపైఁ బ్రాకునని శాస్త్రములు చెప్పి యుండలేదా? నాబుద్ధి సురిగినది. ఈయపకీర్తి లోకమంతయు వ్యాపించియున్నది కాఁబోలు అయ్యో ! నేను వట్టి మూడుఁడనై పోయితిని అని తలంచుచుఁ గోపోద్దీపితమానసుడై యప్పుడ కాళిదాసు నొద్దకుబోయి పెడమోముతో నీవు నాదేశమునుండి యిప్పుడే లేచి పోవలయును. అని పలికి యజ్జనపతి యవ్వలకుఁ బోయెను.

ఆమాటనిని కాళిదాసు నేనేమితప్పుజేసితిని? నన్నెందులకుఁ బొమ్మంటివి? అని యేమియునడుగక మహాప్రసాదమని యుచ్చరించి యప్పుడే లేచి కట్టుగుడ్డలతో నెక్కడికో పోయెను. పిమ్మట నతం డంతటితో వదలక యాంతరంగిక పరిచరులఁ గొందఱంజీరి లీలావతి నొరులె రుంగకుండ నర్ధరాత్రంబునం దీసికొనిపోయి మహారణ్యములో విడిచి రమ్మని నియమించెను. దైనప్రతికూలదినములలో మంచియంతయుఁ జెడ్జక్రిందఁ బరిణమించునుగదా? అనియెఱింగించి మణిసిధుండవ్వలికథ పైమజిలీయందుఁ జెప్పఁదొడంగెను.

___________

144 వ మజిలీ

శ్లో॥ సతాం హి సందేహపదేషు వస్తుషు
     ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః॥

మిత్రునిఁ గళత్రమును వెడలఁద్రోయించినది మొద లమ్మేదినీపతి హృదయమున స్థిమితము చెడిపోయినది. సభకుఁ బోవఁడు. ఇతరులతో మాటాడుటమానివేసెను. ఏదియో ధ్యానించుచు నొక్కఁడు గూర్చుండును. వారి విషయమై పరిజను లేమనుకొనుచున్నారో యని