పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వచ్చి చెప్పుము. ఆయనతోఁ గొన్నిరహస్యములు మాటాడవలసియున్నదని చెప్పిన నాపరిచారిక పోయి తొంగిచూచినది.

అందొకశయ్యపైఁ గాళిదాసకవి యవ్వలిమొగంబై పండుకొని నిదురించుచుండెను. భోజుఁడు వేరొకపీఠముపైఁ గూర్చుండి పరిచారిక తొంగిచూచివెళ్లుట పరికించి శంకాకళంకితమతియై మెల్లగా నవ్వలకుదాఁటి చాటునఁ గూర్చుండెను.

పరిచారిక పోయి యయ్యగారొక్కరే పండుకొనియున్నారని రాజభార్యతోఁ జెప్పినది. అప్పుడాయిల్లాలు దివ్యమణిభూషాంబరంబులు ధరించి యుపహారంబులఁ గైకొని మెల్లగా నాగదిలోనికింబోయి యొకశయ్యపై ముసుంగిడికొని పడుకొనియున్న కాళిదాసుం జూచి భర్తయనుకొని యామంచముపైఁ గూర్చుండి మనోహరా ! లెండు. ఈఫలాహారముల భుజింపుఁడు. నాపై గోపమువచ్చినదా యేమి? వెనుకటివలె మాటాడుట మానివేసిరేమి? కవిరాజు రాఁగలఁడు వేగలెండు మీతోఁ గొంత ముచ్చటింపవలసియున్నది. అని పలుకుచు ముసుఁగు లాగినది. కాళిదాసనిగ్రహించినది.

సిగ్గుపడుచు దిగ్గునలేచిపోయినది. రాజు గవాక్షవివరములనుండి యంతయుం జూచుచుండెను. కవిరాజు రాఁగలఁడు అనుమాటలో రాజురాఁగలఁడు అనుమాటమాత్రమే వినంబడినది. తన్నుఁ జూచి వెళ్లిపోయినదని నిశ్చయించెను. మెల్లన నామెగది దాపునకుఁబోయి యేమనుకొనుచుండునో యని పొంచియుండెను. అప్పు డత్తరుణి పనికత్తెతో తొత్తా ! తిన్నగాఁజూడక యబద్ధము చెప్పెదవా ? ఎంత ప్రమాదము. ఎంతప్రమాదము. చీ చీ అశ్రద్ధబుద్ధిని నిన్ను శిక్షింప వలయునని మందలించుచున్నది.

ఆమాటలు విని రాజు ఇప్పుడు తెలిసినది. నాయునికి యాపని కత్తెకుఁ తెలియక యాతఁడొక్కఁడే యున్నాడని చెప్పినదికాఁబోలు.