పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుని కథ.

17

శ్లో॥ ముద్గదాళీగదవ్యాళీ కవీంద్రవితుషాకథం।

రోగములఁ బోగొట్టెడు నీపెసరపప్పునకుఁ బొట్టేమిటికిఁ దీయ వలయును. కవీంద్రా! చెప్పుము. అనియడిగినఁ గాళిదాసు

శ్లో॥ అంథోవల్లభసంయోగే జాతా విగతకంచుకా॥

అన్నమనుభర్తలోఁ గలసికొనుటచే నది విగతకంచుకయైనది. అనగా రవికలేనిదియైనదనియుఁ బొట్టులేనిదియనియు శ్లేషించి సమాధానము జెప్పెను. ఆచమత్కారసమాధానము గ్రహించి లీలావతి యించుక నవ్వినది. ఆనవ్వే యానృపాలుని హృదయాంబుజమునకు వెన్నెల యైనది.

అతండు మొగముముడుచుకొని యాత్మగతంబున నయ్యో ! స్త్రీసమక్షమం దీతండింత నిర్భయముగా నిట్టి యుత్ప్రేక్షప్రకటించెనే! లీలావతి యదివిని సిగ్గుపడక సంశయమువిడిచి నవ్వినది. ఇది యెంత యనుచితమైనపని. దీనిఁబట్టిచూడ లోకాపవాదము కొంతసత్యమేమో యని భ్రమకలుగఁ జేయుచున్నది,

శ్లో॥ న స్త్రీణా మప్రియః కశ్చి త్ప్రియో వాపి న విద్య తె।
     గావ స్తృణమి వారణ్యే ప్రార్థయంతి నవం నవం॥

స్త్రీలచిత్త మిట్టిదని దేవుఁడే తెలిసికొనలేడన నాకెట్లు శక్యమగును. అని యనేకవిధంబుల నాలోచించుచు మఱికాళిదాసుతో మాటాడ లేదు. కోపదృష్టుల భార్యనిరీక్షించుచుండెను. వెనుకటివలెఁ గాళిదాస కవియుఁ దానుంగూర్చున్నసమయంబున నామెవచ్చి యుపచారములఁ జేయఁబూనిన నవ్వలఁబొమ్మని తీక్షణముగాఁ బలుకును. ఈరీతిఁ గొ"న్నిదినములు గడచినవి. ప్రచ్ఛన్నముగా వారిచర్యలు పరీక్షించు చుండును.

ఒకనాఁడు లీలావతి తనపనికత్తెనుబిలిచి నీవుపోయి యాగదిలో నిప్పు డెవ్వరుండిరో చూచిరమ్ము. రాజుగారొక్కరే యున్నచో వడిగా