పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

శ్లో॥ ఘృతకుంభసమానారీ | తప్తాంగారసమఃపుమాన్
     తస్మాద్ఘృతంచవహ్నించ | నైకత్రస్థాపయేద్బుధః ॥

రాజా ! నీవు బుద్ధిమంతుఁడవయ్యు మిత్రలోభంబునంజేసి స్త్రీ నెట్లు కాపాడవలయునో తెలిసికొనలేకున్నావు. కాళిదాసకవి యెంత జారుఁడో నీవెఱుఁగవా ? అతఁ డంతఃపురద్రోహము జేయుచున్నాఁడని లోకమంతయుఁ జెప్పెకొనుచున్నది. నీకిష్టమున్న భూములిమ్ము. గ్రామములిమ్ము. ద్రవ్యమిమ్ము. అంతియగాని యవమానకరముగా సంతతము నంతఃపురమందుంచికొని భార్యచే మర్యాదను మీఱిన యుపచారములఁ జేయింపరాదు. జతుకాష్టం బెంతగట్టిదైనను నిప్పు వేడిసోకిన మెత్తబడకుండునా ? కర్తవ్యమాలోచించుకొనుము అని యున్న యుత్తర మారాజు ముమ్మాఱుచదివెను. అది యెవ్వరువ్రాసినదియును పేరులేదు.

అందలివిషయములు నిర్మలమైన యతనిమనస్సును గలుషపఱచినవి. ఇంచుక యాలోచించి యతం డాహా ! మహానుభావుండగు కాళిదాసు మిత్రద్రోహము సేయునా ! చేయఁడు. పురుషుని మనంబు చంచలమగుట చేయుతలంపు గలిగియున్నను లీలావతి మహాసాధ్వి. తుచ్ఛపుపనుల కిష్టపడునా ? నాయందుగల యనురాగమంతయు మట్టుపరచి పరచింత వహించునా? వట్టిది. వట్టిది. మేరువుచలించినను నయ్యించుబోడి మది చలింపదు. గిట్టనివారెవ్వరో యిట్టికల్పనఁజేసిరి, అని నిశ్చయించి యాకళంకము మనసునుండి త్రోసివేసి యధాగతముగానే సంచరించుచుండెను.

మఱియొకనాఁడు. లీలావతి స్వయముగా వంటజేసి భర్తకు వడ్డించినది. కాళిదాసకవి దాపుననే పైడిపువ్వులపీటపై గూర్చుండి రాజుతో వినోదముగా మాటలాడుచుండెను. పొట్టుతీసిన పెసరపప్పును జూచి రాజు,