పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుని కథ.

15

వేఱొకతె -- సరి సరి. నీ కసలు తెలియలేదు. (చెపులో) గజ యాన చెప్పినది.

ఇంకొకతె - ఆఁ ! ఆఁ ! ఏమీ ! అబద్ధమేమో?

వేఱొకతె - అబద్ధమా ! దానికేకాదు. అయ్యంతఃపుర పరిచారికల కందఱకును దెలియును. రహస్యములేదు. హేరాళమే.

ఇంకొకతె - రాజుగారి కిష్టమేనా? సహించుచున్నారా?

వేఱొకతె - ఆమె యాయస కేదియో మందువేసినది. రాజు మందమతియై వారెట్టి శృంగారలీలలఁ గావించుకొనినను జూచుచు సంతోషించును.

రాజభార్యలు -- (నగు మొగములతో) చీ! రండలారా! ప్రేలకుఁడు. మాయెదుట మాయక్క నాక్షేపించిన నూరకుందుమా! ఆమె తెలివిగలది. మగని వశపరచుకొన్నది. అంతియకాని మఱియొకటిగాదు..

పరిచారికలు - అమ్మా! నోరుమూసిన లోకమును మూయుదురా ? దేశమంతయుఁ జెప్పికొనుచునే యున్నారు. మీయక్కను మేమొక్కళ్ళమే యాక్షేపింపలేదు.

భార్యలు -- ఆమాట రాజుగారికిఁ దెలియునట్లామెయంత:పురమున వ్యాపిపఁ జేయుఁడు. అంతియెకాని మాయెదురఁ బలుకవలదు.

అని రాజభార్యలు పరిచారికల కుపదేశించిరి. వాండ్రు క్రమ క్రమముగా లీలావతి పరిచారికలకడను శుద్ధాంతములయందు నా మాటలే యాక్షేపించుచుండిరి. ముఖాముఖీగా రాజుగారి చెవింబడినది.

మొదట నతం డాప్రవాదము నంతగా లెక్కచేయలేదు. మఱి యొకనాఁ డొక పత్రిక యతని తలయంపినుంపఁబడినది, దానిని విప్పి చదువ నిట్లున్నది.