పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పుమనియు రాజే యామెకునియోగించుచుండును. భోజుండుతనకు జేసేన దానికన్న నాకవికిఁ జేసిన యుపచారమువలన మిగులఁ బ్రీతుండగు చుండును. లీలావతియు భర్తమతి ననుసరించియే కాళిదాసునకు నుపచారములు చేయుచుండును.

ఒకప్పుడు భోజునకు దేహములోఁ గొంచె మస్వస్థత గలుగుటయుఁ గాళిదాసునితోఁగూడ సంతతము లీలావతి మందిరమందేవసించి యుండెను. ఆయునికి యితరకవులకు నితరరాజభార్యలకుఁగూడ నసహ్యా సూయల జనింపఁ జేసినది---

పండితులు కాళిదాసుగౌరవము జూడలేక యోహోహో! రాజెంత యవివేకియయ్యెను ! జారశిఖామణియై సర్వదా వారస్త్రీ లంపటుండుగుకాళిదాసుని లీలావతి యంతఃపురమునకుఁ దీసికొనిపోయి యేయవరోధములేకుండ నామెచే నుపచారములు జేయించుచున్నాఁడఁట. ఎంతప్రీతిగలిగినను నేక్షత్రియుండైన నిట్లు కావించెనా? వట్టి యమాయకుండై స్త్రీయంత్రమున దగుల్కొనెనని యాక్షేపింప మొదలు పెట్టిరి-

రాజభార్యలు లీలావతి గౌరవమును సహింపక యొకనాఁడు గుమిగూడి తమ పరిచారికలచే నిట్లు పలికించిరి.

ఒకతె – అయ్యో! లీలావతి చర్యలన్నియును నాకు రాజరత్నము జెప్పినది. భోగముదానికన్న నతిశయించినదఁట. కాళిదాసునకు మడుపులందించుటయు విసరుటయుఁ బన్నీరు జల్లుటయు లోనగునుపచారములన్నియు నామెయేచేయునట. ఇఁకఁ జెప్పనేమియున్నది. ఈ విషయమై రాజు వట్టి వెఱ్ఱివాఁడైపోయెను

మఱొకతె - మడుపుల చేతికందియ్యదు. నోటికే! ఆకవికి గందము పూయుచుండఁ బలుమాఱుచూచితినని నాకు జకోరాక్షి చెప్పినది. అంతప్రీతియున్నఁ బరిచారికలచేతఁ జేయింపరాదా? ఏరాజ భార్యయైన నిట్టివిరుద్ధకర్మముల కంగీకరించునా?