పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అళ్లాణరాజుకథ.

285

గపటముచేసితినని రాజుగారు నన్ను నిందింపఁగలరు. అని ప్రబోధించుటయు నతఁడు మెల్లన కన్నులందెఱచి మెఱపుతీఁగెవోలెఁ దత్తనుకాంతి మిఱుమిట్లుగొలుపఁ జూడఁజాలక అయ్యో తల్లీ ! నీవేడి యుపసంహరింపుము. శాంతురాలవుకమ్మని ప్రార్థించెను. సువ్రత యతనిమాటలు విని “అయ్యో! ఇదియేమికర్మము. నన్నుఁజూచి యితఁ డూరక వెఱచుచున్నాఁడు. నాకు లేనిపోనిరూపులఁ గల్పించుచున్నాఁడు. నాకేమియుం దెలియదు. నే నేమిచేయుదును? ప్రాణనాథుండు నన్నుఁ గపటాత్మురాలని నిందించునేమో? వీనికి నేను వికృతరూపముగాఁ గనంబడుచున్నాను కాఁబోలు. ఈశ్వరమాయఁ దెలియ నెవ్వరితరము” అని ధ్యానించుచు నతని మఱియు మఱియు బోత్సాహపఱచినది.

ఆమెమాటాడిన శూలమువలె వానికి గ్రుచ్చుకొనుచుండెను. అతఁడు కన్నులుమూసికొని తల్లీ! తల్లీ! రక్షింపుము. రక్షింపుమని వేఁడుటతప్ప వేఱొకమాట లేదు. ఈరీతిని వారిరువురు సంవాదము సేయుచుండ నింతలోఁ గోడికూసినది. అప్పు డారాజు వా రేమిచేయుచున్నారో చూడవలయునని యాగదిదాపునకు వచ్చి లోపలివాక్యము లాలించెను. దేవీ! నన్ను మన్నింపవా? నీవేడికి నాయొడలు మండిపోవుచున్నది. శాంతింపుము. అయ్యో ! మహారాజా ! నాకామితము దీర్తుననిచెప్పి యిట్టి దారుణము సేసితివేల? మహాశక్తిని ప్రయోగింతువా ? ఇదియా నీవ్రత పరాయణత్వము. నాకామితము దీర్చుటకంటెఁ బెద్దగా సంతసింతును ఈయాపద దాటింపుము. అని పెద్దయెలుంగున మొఱవెట్టుచుండెను.

ఆమాటలువిని రాజు వెఱవకుము వెఱవకుము. ఇదిగో నేను వచ్చుచున్నాను. అని గుభాలునఁ దలుపుదెఱచుకొని లోనికింబోయెను. సువ్రత మంచముదాపున నిలువంబడియున్నది. కన్నులుమూసికొని మహేశ్వరుం డామెపాదంబులదాపునఁ బడియుండెను. ఆ ! ఆ ! ఏమీ? ప్రేయసీ ! అతిథిని భయపెట్టుచుంటివా? అట్లు వేఁడుచున్నాఁడేమి? అని