పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నలు దెసలవ్యాపింప నామహేశ్వరుఁడు పండుకొనియున్న గదిలోనికిం బోయి యతనికి నమస్కరించి మహాత్మా ! నేనొక వారకాంతను. భల్లాణభూపాలునిపంపున మీకడకు వచ్చితిని. నావలన మీయభీష్టము దీర్చుకొనుమని పలుకుచు నెదుర నిలువంబడినది.

అతం డామె నెగాదిగఁజూచి మంచముడిగ్గనుఱికి యామెపాదంబులంబడి నమస్కరించుచు దేవీ ! నీవు వారకాంతనని చెప్పుచుంటివేల? పార్వతివలెఁ గనంబడుచుంటివే? అదిగో ఫాలనేత్రము. తెఱవకుమీ ? నేను భస్మమైపోయెదను అయ్యో ! నీవెక్కిన సింహంబు నాపై తీక్ష్ణ దృష్టులు వ్యాపింపఁజేయుచున్నది. తల్లీ ! ఆదరింపవా ? నీచేతనున్న త్రిశూలముజూడ వెఱపుగలుగుచున్నది. తుచ్ఛపుకోరిక కోరినందులకు నన్ను శిక్షింపవచ్చితివా ? లోకమాతా ! నీకు నమస్కారము. నాతప్పు మన్నింపుము. ఎఱుఁగ కట్టిమాట పలికితినని ప్రార్థించుచుండెను.

ఆమహేశ్వరుని పిచ్చిమాటలువిని రాజపత్ని వెఱఁగుపడుచు సౌమ్యా ! నేను బార్వతినికాను లక్ష్మినికాను సరస్వతినికాను. ఒక వేశ్యకాంతను. రాజుగారిని నీవు కోరితివఁట. నాకు సొమ్మిచ్చి యీరాత్రి మీ యొద్దకనిపిరి. ఇదియు నిజము. మీరు బ్రాహ్మణులు నేను సానిదానను. నాకు నమస్కరింపరాదు. వేగము మీయభీష్టము దీర్చుకొండని క్రమ్మఱఁబలికినది. అతండు బాబో ! నీమాటలు మెత్తగానున్నవి. నీరూపము జూడ మహాశక్తివలెఁ గనంబడుచుంటివి. అమ్మో! నీవదనబిలము పాతాళమువలెనున్నది. నాలుక జ్వాలికవలె వ్రేలాడుచున్నది. నీచూపులు శూలములవలె నన్నుఁ బొడుచుచున్నవి. అంబా ! నీభయంకరమూర్తి నుపసంహరింపుమని ప్రార్థించుచు కన్నులుమూసికొని పాదంబులం బడియెను.

అప్పు డామె అయ్యో ! మహేశ్వరా! నీవు మహేశ్వరుండవగుటఁ బార్వతిరూపమున వచ్చితిని. నీకామ్యము దీర్చుకొనుము. లేకున్నఁ