పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పిమ్మట నావిటుఁడు నీలవేణియింటికిఁ బోయిచూచిన నా వెలఁది భుజంగుఁడు తనతొడ శిరంబిడికొని యాలింప హాయిగా సంగీతము పాడుచుండెను. ఆవింతజూచి యతండు గిరుక్కున మఱలి యాచక్కి నున్న పద్మగంధియింటికిఁ బోయి తలుపుగొట్టెను. దానిం గళత్రముగా స్వీకరించిన రంగాచార్యులువచ్చి తలుపుతీసి యేమిపనియనియడిగిన నేమియులేదని యవ్వలికిఁ బోయెను. ఆచార్యు లనుమానము జెంది లోపలికిఁ బోయి పద్మగంధింజూచి యౌరా ! నీవెంతదానవు ? ఎవ్వరు నాయింటికి వచ్చుటలేదని ప్రమాణికము చేసితివే ? ఇప్పు డాతుంటరి నీయింటి కింత ప్రొద్దుపోయి యేమిటికిరావలయును ? పాపము వాఁడు నేను లేననుకొనెనుకాఁబోలు. నన్నుఁజూచి యేమియుమాటాడక యవ్వలికిఁ బోయెను. వాఁడు వచ్చినకారణము జెప్పుమని నిర్బంధించెను.

పద్మగంధి – రామ రామ మీతోడు నేనేమియు నెఱుఁగను. వాఁడెవ్వఁడు ?

ఆచార్యులు - వాఁడా? పోకిరీతనముగాఁ జెడ్డవేషమువైచికొని యీవేశ్యవాటికలోఁ దిరుగుచుండెడి పారుబోతు. కనకాచలము మూలముగా మాయిరువురకు నొకప్పుడు ముష్టియుద్ధము జరిగినది. నాదాయ వాఁ డిందేల రావలయును?

పద్మగంధి — ఎందులకువచ్చెనో తెలియదు. నమ్మిన నమ్ముఁడు లేకున్న నే నేమిచేయుదును ?

ఆచార్యులు — మఱియెవ్వరిని రానీయననియేకదా! నావలన నిబ్బడిగా ధనముదీసికొంటివి ? ఆతొత్తుకొడుకు నాయింటి కేమిటికి రావలయునో చెప్పుము. ఈరాత్రికి నేను రాననుకొని రమ్మంటివి. మీసంగతి యెఱిఁగియే వెళ్ళినపని కాకున్నను సత్వరముగా వచ్చితిని. నేఁడు రాకున్న నెంతమోసము జరుగును ?