పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అళ్లాణరాజుకథ.

279

బనికిరారు. చంద్రలేఖ, తారావళి, పద్మగంధి, మణిమంజరి, మధురాధర, విద్రుమోష్టి, శరచ్చంద్రిక, హేమలత, నవమల్లిక, కాంతిమతి, లోనగు మగువలు ప్రముఖులు. కావలసిన వారిం దీసికొనివచ్చెదము. సెలవీయుఁడని యడిగిన మంత్రు లిట్లనిరి.

మా కెందఱో అక్కఱలేదు. మంచి చక్కని దొక్కరితయ చాలును. ఆకసంబడు పెద్దమేడ యెవ్వరిదని యడిగిన విటుండు, అయ్యా! అది చంద్ర లేఖయిల్లు. అది రూపమునందు నాటపాటలయందును బ్రముఖురాలే. తీసికొనిరానా ? అనిపలుకుచు వారియనుమతివడసి చంద్రలేఖ నక్కడకుఁ దీసికొనివచ్చెను. మంత్రుల కది నమస్కరించినది. దానిం జూచి సచివు లాశ్చర్యమందుచు వలసినంత ద్రవ్య మిప్పింతుము నేఁటిరాత్రి నొకమహేశ్వరుని యాధీనములో నుండవలయు నిది రాజుప్రీతి కరమైనపనియని విటుముఖముగా నడిగించిన నవ్వెలయాలు రాజశాసనమునకు బద్ధులమే. నావిటుండు మంచముపై నున్న వాఁడు. వానితోఁ జెప్పి యంగీకరింపఁజేసివత్తు నంతవఱకు నవకాశమీయుఁడని కోరికొనినది.

మంత్రులు పో, పొమ్ము, నీవు పనికిరావు. విటునియధీనములోలేనిబోగముదాన కావలయునని పలికిన బాబూ ! తారావళి కాళిగా నున్నది. దానిం దీసికొనిపొండు అనిచెప్పి చంద్రలేఖ సెలవుపుచ్చుకొని వెళ్లి పోయినది. విటుఁడు తారావళియింటి కరిగి, మంత్రులసందేశ మెఱింగించి యక్కడకుఁ దీసికొనివచ్చెను. దానిఁజూచి మంత్రులు నేఁటిరాత్రి నీవువిడిగానుంటివేని కానుక లిప్పింతుము మాతో రమ్ము. పనియున్నదని యడిగించిరి. అది స్వామీ! నే నింతదనుక విడిగానేయుంటిని. ఇప్పుడే యొకపల్లవుఁడు తాంబూల మిచ్చిపోయెను ఈఱేయి తీరిక లేదని చెప్పినది. మంత్రులు విటునిపై నలుగుచు నీవు విటయు క్తలం దీసికొనిరావలదు వారివారియిండ్లకుఁ బోయి విడిగానున్న పడఁతిం దీసికొనిరమ్ము. వలసినంత ద్రవ్య మిప్పింతము. అనినియోగించి మంత్రు లందే నివసించిరి.