పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మహేశ్వరా ! నీవు యథార్థవాదివి. నీమాటలు నాకు సంతోపమును గలుగఁజేసినవి. నీ వేమియు సంశయింపకుము. నీకోరిక తప్పక తీర్పించెద. పరాశరప్రభృతిమహర్షులు కామమునకు దాసులైరనుచో నితరులమాట చెప్పనేల ? ఇందుఁ దప్పేమియు లేదు. వేశ్యకాంతలు వివాహమాడక కన్యలైయుండుట మీవంటివారినిమిత్తమే? మాయూరఁ జక్కఁదనంబునఁ బేరుపొందిన వారసుందరులు పెక్కండ్రు గలరు. వారిలోఁ జక్కనిదానినొక్క తె రప్పించి నీయభీష్టము దీర్పించెద నంగీకారమేనా? అని యడిగిన నతం డిట్లనియె.

మహారాజా ! నేను వేశ్యకాంతంగాక కులకాంతం గోరుదునా ? మఱియొకమాట జ్ఞాపకముంచుకొన వలయును. నీవు శాసనకర్తవు. నీయాజ్ఞ నెల్లరు శిరసావహింతురు. నేఁటిరాత్రి యొకవిటుని యధీనములో నున్న వారాంగనం దీసికొనిరాఁగూడదు. కామము సర్వసాధారణము. ఇప్పుడు నే నెట్లుపరితపించుచుంటినో యావిటుఁడు తద్వియోగమున నట్లు పరితపింపఁగలఁడు. ఒరులబాధపెట్టి యనుభవించినసుఖము సుఖముకాదు. విమర్శించి రప్పింపుఁడని చెప్పెను.

ఆమహేశ్వరునియుపన్యాసమునకు మిగుల సంతసించుచు భళ్లాణుండు నీవుకోరినరీతినే కావించెద సంశయింపకుమని పలుకుచుఁ దన గృహంబున నొకగది యలంకరింపఁజేసి యనల్పశిల్పికల్పితంబగు హంసతూలికాతల్పంబున నతనిం గూర్చుండఁబెట్టి యుత్తమలక్ష్మణోపేతయై యొకరి యాధీనములో లేని వారకాంతం దీసికొనివచ్చి యప్పగింపవలయునని మంత్రులకు నియోగించి తాను దేవతా గృహంబునకుఁ బోయెను.

మంత్రులు శృంగారపురుషులఁ గొందఱ వెంటనిడుకొని యా పురివేశ్యవాటికకుఁ బోయి యందొకచో నిలువంబడి యిందు రూపయౌవన విద్యావిశేషములచేఁ బేరుపొందిన వారసుందరు లెందఱుగలరు? వివరింపుఁడని యడిగిన నందొక విటప్రముఖుం డిట్లనియె. ప్రభువులారా ! వినుఁడు మనపురంబునంగల వారాంగనల కచ్చరలు దాస్యముసేయఁ